సంఖ్యా 14
14
ప్రజల తిరుగుబాటు
1ఆ రాత్రి సమాజంలో ఉన్న అందరు స్వరాలెత్తి బిగ్గరగా ఏడ్చారు. 2ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, “మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది! 3మేము ఖడ్గం చేత చావడానికి మమ్మల్ని యెహోవా ఈ దేశానికి ఎందుకు తెస్తున్నారు? మా భార్య పిల్లలు చెరగా కొనిపోబడతారు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం మాకు మంచిది కాదా?” అని వారితో అన్నారు. 4వారు ఒకరితో ఒకరు, “మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం” అని మాట్లాడుకున్నారు.
5అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజమందరి ఎదుట సాష్టాంగపడ్డారు. 6ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని, 7ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము వెళ్లి పరిశీలించిన దేశం చాలా మంచిగా ఉంది. 8యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు. 9మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు.
10అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది. 11యెహోవా మోషేతో, “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను ధిక్కరిస్తారు? నేను వారి మధ్య అన్ని సూచనలు చేసినప్పటికీ, వారు నన్ను నమ్మడానికి ఎంతకాలం నిరాకరిస్తారు? 12తెగులుతో వారిని మొత్తి నాశనం చేస్తాను, అయితే వీరిని మించిన బలమైన గొప్ప ప్రజలుగా నిన్ను చేస్తాను” అని అన్నారు.
13మోషే యెహోవాతో, “ఈజిప్టువారు దాని గురించి విన్నప్పుడు వారు ఏమనుకుంటారు? మీ ప్రభావం చేత వారి మధ్య నుండి వీరిని తెచ్చారు. 14ఈ దేశ నివాసులకు దానిని గురించి వారు చెప్తారు. ఇప్పటికే మీరు యెహోవా, ఈ ప్రజలతో ఉన్నారని, మీరు ముఖాముఖిగా వీరికి కనిపిస్తారని, మీ మేఘము వీరితో ఉంటుందని, మీరు పగలు మేఘస్తంభంలో, రాతి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తారని వారు విన్నారు. 15ఒకవేళ ఎవరిని విడిచిపెట్టకుండా ఈ ప్రజలందరినీ చంపేస్తే, మీ గురించి ఈ విషయాలు విన్న దేశాలు, 16‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు.
17“కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక: 18‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’ 19మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ ప్రజల పాపాన్ని, ఈజిప్టు వదిలినప్పటి నుండి ఇప్పటివరకు వీరిని క్షమించిన ప్రకారం క్షమించండి” అని అన్నాడు.
20యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను. 21అయినా, నా జీవం తోడు, యెహోవా మహిమ భూమంతటిని నింపునట్లు, 22నా మహిమను, ఈజిప్టులోను, అరణ్యంలోను నేను చూపిన సూచనలను చూసి నాకు లోబడక, నన్ను పదిసార్లు పరీక్షించిన ఏ ఒకరు, 23వారి పూర్వికులకు నేను వాగ్దానంగా ప్రమాణం చేసిన దేశాన్ని వారిలో ఏ ఒక్కరు ఎప్పటికిని చూడరు. నా పట్ల ధిక్కారంగా ప్రవర్తించిన వారెవ్వరూ ఎప్పటికీ చూడరు. 24అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు. 25అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు.
26యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: 27“ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను. 28కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు: 29ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు. 30నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు. 31దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను. 32మీ విషయానికొస్తే, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. 33మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు. 34నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’ 35యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.”
36మోషే, ఆ దేశాన్ని పరిశీలించండి, అని పంపిన మనుష్యులు, వెళ్లి తిరిగివచ్చి దాని గురించి తప్పుడు నివేదిక తెచ్చి సమర్పించి, సర్వసమాజం సణుగునట్లు చేశారు 37తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు. 38ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు.
39మోషే ఇశ్రాయేలీయులందరికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు చాలా ఏడ్చారు. 40మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు.
41కానీ మోషే, “ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? ఇదిలా కొనసాగదు! 42యెహోవా మీతో లేడు కాబట్టి మీరు వెళ్లకండి. మీరు శత్రువుల చేతిలో ఓడిపోతారు, 43ఎందుకంటే అమాలేకీయులు, కనానీయులు అక్కడ మీ మీదికి వస్తారు, మీరు వారి ఖడ్గం చేత చస్తారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన మీతో ఉండరు” అని చెప్పాడు.
44అయినాసరే, వారు అహంకారంతో మోషే గాని, యెహోవా నిబంధన మందసం గాని శిబిరం నుండి కదలక పోయినా, కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు. 45అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 14: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.