సంఖ్యా 8
8
దీపాలను సిద్ధం చేయడం
1యెహోవా మోషేతో ఇలా చెప్పారు. 2“అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, ‘దీపాలను వెలిగించినప్పుడు, దీపస్తంభం ముందు ఉన్న స్థలమంతా ప్రకాశించేలా మొత్తం ఏడు దీపాలు వెలిగేలా చూడాలి.’ ”
3అహరోను అలాగే చేశాడు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు దీపస్తంభం మీద దీపాలు వెలుగు ఇచ్చేలా అమర్చాడు. 4దీపస్తంభం ఇలా చేయబడింది: అది దాని స్తంభం నుండి దాని పుష్పాల వరకు సుత్తెతో సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. యెహోవా మోషేకు చూపిన నమూన ప్రకారం అది తయారుచేయబడింది.
లేవీయులను ప్రత్యేకించడం
5యెహోవా మోషేతో ఇలా చెప్పారు. 6“ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకపరచి వారిని ఆచార ప్రకారం పవిత్రపరచు. 7వారిని పవిత్రపరచడానికి ఇలా చేయాలి: వారి మీద శుద్ధి జలం ప్రోక్షించాలి; తర్వాత వారు తమ శరీరాలంతా క్షవరం చేయించుకొని తమ బట్టలు ఉతుక్కోవాలి. అలా తమను తాము పవిత్రపరచుకుంటారు. 8వారు ఒక కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండిని భోజనార్పణగా తేవాలి; తర్వాత వారి నుండి రెండవ కోడెను పాపపరిహారబలి కోసం తీసుకోవాలి. 9లేవీయులను సమావేశ గుడారం ముందుకు తీసుకువచ్చి మొత్తం ఇశ్రాయేలీయుల సమాజాన్ని సమావేశపరచు. 10యెహోవా ముందుకు లేవీయులను నీవు తీసుకురావాలి, ఇశ్రాయేలీయులు వారి మీద చేతులుంచాలి. 11అహరోను తన చేతులు పైకెత్తి, ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రత్యేక అర్పణగా లేవీయులను యెహోవాకు సమర్పించాలి, తద్వారా వారు యెహోవా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
12“అప్పుడు లేవీయులు కోడెల తలలపై వారి చేతులుంచి, ఒకటి పాపపరిహారబలిగా ఇంకొకటి లేవీయుల ప్రాయశ్చిత్తం కోసం దహనబలిగా యెహోవాకు అర్పించాలి. 13లేవీయులను అహరోను, అతని కుమారుల ఎదుట నిలబెట్టి, చేతులు పైకెత్తి యెహోవాకు వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించాలి. 14ఈ విధంగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించాలి, లేవీయులంతా నా వారుగా ఉంటారు.
15“లేవీయులను పవిత్రపరచిన తర్వాత, చేతులు పైకెత్తి వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించిన తర్వాత, వారు సమావేశ గుడారంలో సేవ చేయడానికి రావాలి. 16వీరు ఇశ్రాయేలీయులలో నుండి సంపూర్ణంగా ఇవ్వబడాల్సిన లేవీయులు. ప్రతి ఇశ్రాయేలు స్త్రీ యొక్క మొదటి మగ సంతానానికి బదులు వీరిని నా సొంతవారిగా తీసుకున్నాను. 17ఇశ్రాయేలులో మనుష్యుల్లోను పశువుల్లోను ప్రతి తొలిచూలు మగ సంతతి నాదే. ఈజిప్టులో జ్యేష్ఠ సంతతిని మొత్తాను కాబట్టి వీరిని నాకు నేను ప్రత్యేకపరచుకున్నాను. 18ఇశ్రాయేలులో జ్యేష్ఠులైన మగవారికి ప్రత్యామ్నాయంగా నేను లేవీయులను ఏర్పరచుకున్నాను. 19ఇశ్రాయేలీయులందరిలో లేవీయులను అహరోనుకు, అతని కుమారులకు కానుకగా ఇచ్చాను. వీరు సమావేశ గుడారంలో సేవ చేస్తారు, ఇశ్రాయేలీయులు పరిశుద్ధాలయాన్ని సమీపించినప్పుడు వారికి తెగులు రాకుండ వారి పక్షాన ప్రాయశ్చిత్తం చేస్తారు.”
20యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే, అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజం లేవీయుల పట్ల చేశారు. 21లేవీయులు తమను తాము పవిత్రపరచుకుని వారి బట్టలు ఉతుక్కున్నారు. తర్వాత అహరోను తన చేతులు పైకెత్తి ప్రత్యేక అర్పణగా వారిని యెహోవా ఎదుట సమర్పించి వారిని శుద్ధీకరించడానికి ప్రాయశ్చిత్తం చేశాడు. 22ఆ తర్వాత, లేవీయులు అహరోను అతని కుమారుల క్రింద సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వారు లేవీయులకు చేశారు.
23యెహోవా మోషేకు ఇలా ఆదేశించారు, 24“లేవీయులు ఈ నియమాలు పాటించాలి: యిరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు గలవారు సమావేశ గుడారంలో సేవలో భాగంగా ఉండడానికి రాగలరు, 25అయితే, యాభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారు ఇంకా పని నుండి విరమించుకోవాలి. 26విరమణ తర్వాత సమావేశ గుడారంలో వారి సహోదరులకు సహకారంగా ఉండవచ్చు కానీ వారంతట వారు పని చేయకూడదు. ఇలా నీవు లేవీయులకు వారి బాధ్యతలను అప్పగించాలి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.