ప్రకటన 17
17
మృగం మీద ఉన్న బబులోను అనే మహావేశ్య
1ఏడు పాత్రలను పట్టుకొని వున్న ఏడుగురు దేవదూతలలో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడికి రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధింపబడిన శిక్షను నీకు చూపిస్తాను. 2భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె తన వ్యభిచారమనే మద్యంతో భూలోక నివాసులందరిని మత్తులుగా చేసింది” అని చెప్పాడు.
3అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూసాను. ఆ మృగం దైవదూషణ పేర్లతో కప్పబడి ఉంది; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్ళు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకొని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది. 5ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరు ఒక మర్మం,
“మహా బబులోను పట్టణం,
వేశ్యలకు తల్లి
భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి,”
అని వ్రాయబడి ఉంది. 6ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు సాక్ష్యాన్ని కలిగివున్నవారి రక్తాన్ని త్రాగిందని నేను చూసాను.
నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను. 7అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీకి సంబంధించిన ఆమె సవారి చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన మర్మాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు. 8నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, అది అగాధం నుండి పైకి వచ్చి దాని నాశనానికి పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు, అది మళ్ళీ వస్తుంది కనుక సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు.
9ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానం గల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చొని ఉన్న ఏడు తలలు ఏడు కొండలను సూచిస్తుంది. 10ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో ఐదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు. 11ఇంతకు ముందు ఉండి, ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు.
12నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. 13వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగివున్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. 14ఈ రాజులందరు మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కనుక ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతోపాటు ఆయనచే పిలువబడిన వారు, ఎన్నుకోబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.
15అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చొనివున్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు. 16నీవు చూసిన ఆ మృగం మరియు ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి. 17ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచాడు. 18నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహాపట్టణం” అని చెప్పాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 17: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.