ప్రకటన 4

4
పరలోకంలో జరిగే ఆరాధన
1ఆ తర్వాత, నేను చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి కనిపించింది. నేను మొదట విన్న బూరధ్వని వంటి స్వరం నాతో, “ఇక్కడకు ఎక్కి రా, తర్వాత జరగాల్సిన దాన్ని నేను నీకు చూపిస్తాను” అని చెప్పింది. 2వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూశాను. 3అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలా కెంపులా మెరుస్తూ కనబడ్డాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తున్న వానవిల్లు ఆవరించి ఉండింది. 4ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు. 5ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. 6ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది.
మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందు వెనుక కళ్లు ఉన్నాయి. 7మొదటి ప్రాణి సింహంలా, రెండవ ప్రాణి దూడలా, మూడవ ప్రాణి ముఖం మనిషిలా, నాలుగవ ప్రాణి ఎగురుతున్న పక్షిరాజులా ఉన్నాయి. 8ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి:
“గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు,
రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు,#4:8 యెషయా 6:3
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ”
9ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా, 10ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు:
11“ఓ ప్రభువా, మా దేవా!
నీవు సమస్తాన్ని సృష్టించావు,
నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి,
కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి
నీవే యోగ్యుడవు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రకటన 4: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి