ప్రకటన 7
7
ముద్రింపబడినవారు 1,44,000
1ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. 2అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, 3“మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను. 4ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000:
5యూదా గోత్రంలో 12,000;
రూబేను గోత్రంలో 12,000;
గాదు గోత్రంలో 12,000;
6ఆషేరు గోత్రంలో 12,000;
నఫ్తాలి గోత్రంలో 12,000;
మనష్షే గోత్రంలో 12,000;
7షిమ్యోను గోత్రంలో 12,000;
లేవీ గోత్రంలో 12,000;
ఇశ్శాఖారు గోత్రంలో 12,000;
8జెబూలూను గోత్రంలో 12,000;
యోసేపు గోత్రంలో 12,000;
బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు.
తెల్లని వస్త్రాలు ధరించిన గొప్ప సమూహం
9ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను. 10వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు:
“సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి,
వధించబడిన గొర్రెపిల్లకే,
రక్షణ చెందుతుంది.”
11అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ, 12ఇలా అన్నారు:
“ఆమేన్!
మా దేవునికి స్తుతి, మహిమ,
జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు,
ఘనత, శక్తి,
ప్రభావం నిరంతరం కలుగును గాక
ఆమేన్.”
13అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
14అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను.
అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. 15అందుకే,
“వీరు దేవుని సింహాసనం ముందు ఉండి,
ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు,
కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు
తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
16‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు
దాహం ఉండదు;
సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’#7:16 యెషయా 49:10
ఏ వేడి వారిని కాల్చదు.
17ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల
వారికి కాపరిగా ఉండి
‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’#7:17 యెషయా 49:10
‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’#7:17 యెషయా 25:8”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.