5
సమాధానము నిరీక్షణ
1మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగివున్నాము. 2ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం 3అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కనుక శ్రమలలో కూడా మనం ఆనందించగలము. 4ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది. 5మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కనుక నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.
6సరియైన సమయంలో, మనం ఇంకనూ బలహీనులమై ఉన్నప్పుడే, క్రీస్తు భక్తిహీనుల కొరకు మరణించారు. 7ఒక మంచివాని కొరకు ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవడమనేది చాలా అరుదు. 8కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనకొరకు మరణించుట ద్వారా దేవునికి మనపట్ల గల తన ప్రేమను కనుపరచారు.
9ఇప్పుడైతే మనం ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడియున్నాం, అలాంటప్పుడు మనం ఇంకెంతగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! 10ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడ్డాం. మనము ఈ సమాధానాన్ని పొందినవారిగా ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాం. 11ఇది మాత్రమే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాం.
ఆదాము ద్వారా మరణం, క్రీస్తు ద్వారా జీవం
12ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరూ పాపం చేశారు, కనుక మరణం ప్రజలందరికి వచ్చింది.
13ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు. 14అయితే, ఆదాములాగా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది, ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు.
15అయితే కృపావరమనేది ఆజ్ఞాతిక్రమం లాంటిది కాదు. ఒకవేళ ఒకని ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే మరి ఇంకెంత ఎక్కువగా దేవుని కృప యేసు క్రీస్తు అనే ఒక మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా! 16దేవుని వరం ఒక మనుష్యుని పాపం యొక్క ఫలితంతో పోల్చబడలేదు: ఒక పాపం వలన తీర్పు వచ్చి శిక్షను తీసుకువచ్చింది, కాని అనేక ఆజ్ఞాతిక్రమాల తరువాత వచ్చిన వరం నీతిమంతులుగా చేసింది. 17ఒకవేళ ఒక మనుష్యుని అతిక్రమం వల్ల, ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యం చేసినట్లైతే, దేవుని కృపాసమృద్ధిని నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒకని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యం చేస్తారు!
18అదేరీతిగా ఒకని ఆజ్ఞాతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒకని నీతివంతమైన చర్య వలన ప్రజలందరూ నీతిమంతులుగా తీర్చబడి జీవాన్ని కలిగివున్నారు. 19ఒక్క మానవుని అవిధేయత వలన అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.
20అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకొనిరాబడింది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత ఎక్కువైనది. 21కనుక, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది.