6
పాపానికి మరణం, క్రీస్తులో జీవం
1అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? 2ఎన్నడు అలా చెప్పకూడదు, పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం? 3లేదా క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా? 4తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతోపాటు పాతిపెట్టబడ్డాము.
5మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతోపాటు ఏకమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఏకమవుతాము. 6మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించునట్లు,#6:6 నశించునట్లు, శక్తి లేనిదిగా అవ్వడం మన పాత స్వభావం ఆయనతోపాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. 7ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు.
8కనుక మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతోపాటు మనం కూడా జీవిస్తూ ఉంటామని మనం నమ్ముతున్నాము. 9క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; మరణం ఎన్నడు ఆయనపై యేలుబడి చేయదు. 10ఆయన మనందరి పాపాల కొరకు మరణించారు, ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.
11అలాగే, పాప విషయంలో చనిపోయాం కాని యేసుక్రీస్తులో దేవుని కొరకు సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. 12కనుక మీ శరీర దుష్ట ఆశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. 13దుష్టత్వాన్ని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి ఇవ్వవద్దు, కాని మరణం నుండి జీవంలోనికి తీసుకొనిరాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించండి. 14మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు గాని, కృప కలిగివున్నారు కనుక ఇక మీదట పాపం మీ మీద అధికారాన్ని కలిగివుండదు.
నీతికి దాసులు
15అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగివున్నాం కనుక మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! 16మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? 17ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికి, మీకు బోధించిన మాదిరికి మీరు హృదయమంతటితో లోబడ్డారు, కనుక అది ఇప్పుడు మీ విధేయతగా చెప్పబడుతుంది కనుక దేవునికి వందనాలు. 18మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.
19మానవులుగా మీకున్న పరిమితులను బట్టి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు మిమ్మల్ని మీరు అపవిత్రతకు, ఎప్పడూ పెరుగుతుండే దుష్టత్వానికి ఎలా దాసులుగా అప్పగించుకొన్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత వైపుకు నడిపించే నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. 20మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి యొక్క అధికారం నుండి మీరు స్వతంత్రులు అవుతారు. 21మీరు ఇప్పుడు సిగ్గుపడునట్లుగా ఉన్న గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల మీకు కలిగిన ప్రయోజనమేమిటి? ఆ పనుల ఫలం మరణమే గదా! 22అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులు అయ్యారు, దాని వలన మీకు కలుగు ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు. 23పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసుక్రీస్తులో#6:23 యేసుక్రీస్తులో ద్వారా నిత్యజీవం లభిస్తుంది.