1 సమూయేలు 20
20
దావీదు, యోనాతాను
1తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.
2అందుకు యోనాతాను, “నీవలా ఎప్పుడూ మాట్లాడకు! నా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా చేయడు. నా తండ్రి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు?” అన్నాడు.
3అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు.
4యోనాతాను, “నీకోసం నేను ఏం చేయాలో చెప్పు అది నేను చేస్తాను” అని దావీదుతో చెప్పాడు.
5అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు. 6నీ తండ్రీ నేను లేనని గమనించినప్పుడు నీవు అతనితో, ‘దావీదు వంశంవారు ప్రతి సంవత్సరం బలి అర్పించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అతడు తన ఊరైన బేత్లెహేముకు వెళ్లడానికి నా అనుమతి కోసం నన్ను బ్రతిమాలాడు’ అని చెప్పు. 7అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు. 8నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.
9యోనాతాను, “అలా ఎప్పుడూ అనవద్దు. నా తండ్రి నీకు హాని చేయాలని చూస్తున్నట్టు నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా?” అన్నాడు.
10అందుకు దావీదు యోనాతానును, “నీ తండ్రి నీతో కఠినంగా మాట్లాడితే దానిని నాకు ఎవరు చెప్తారు?” అని అడిగాడు.
11యోనాతాను దావీదుతో, “పొలంలోనికి వెళ్దాం రా” అన్నప్పుడు ఇద్దరు కలిసి పొలంలోనికి వెళ్లారు.
12తర్వాత యోనాతాను దావీదుతో, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సాక్షి, రేపుగాని ఎల్లుండి గాని ఈ సమయానికి నా తండ్రిని కలుసుకుంటాను. అతడు నీ పట్ల సానుకూలంగా ఉంటే ఆ విషయాన్ని నీకు తెలియచేయకుండా ఉంటానా? 13అయితే నా తండ్రి నీకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలిసి కూడా నీకు చెప్పి నిన్ను క్షేమంగా పంపించకపోతే యెహోవా యోనాతానుకు గొప్ప హాని కలిగించును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండును గాక. 14అయితే నేనింకా బ్రతికి ఉంటే నేను చనిపోకుండా యెహోవా దయ చూపినట్లు నాపై దయ చూపించు. 15యెహోవా దావీదు శత్రువులలో ఒక్కరిని కూడా భూమి మీద నిలువకుండా నిర్మూలం చేసిన తర్వాత కూడా నీవు నా సంతానం పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విడిచిపెడతారు” అన్నాడు.
16“యెహోవా దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా చేయును గాక” అని చెప్తూ యోనాతాను దావీదు కుటుంబంతో నిబంధన చేశాడు. 17యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.
18యోనాతాను దావీదుతో, “రేపు అమావాస్య. నీ చోటు ఖాళీగా ఉంటుంది కాబట్టి నీవు లేవని తెలుస్తుంది గదా. 19నీవు మూడు రోజులు ఆగి ఇదంతా మొదలైనప్పుడు నీవు దాక్కున్న స్ధలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు. 20గురి చూసి కొట్టినట్లుగా నేను మూడు బాణాలను దాని ప్రక్కకు వేస్తాను. 21‘వెళ్లి బాణాలను వెదకు’ అని ఒక పనివాన్ని పంపుతాను. నేను అతనితో, ‘ఇటువైపు ఉన్న బాణాలు చూడు; వాటిని తీసుకురా’ అని చెప్తే నీవు రావచ్చు; ఎందుకంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీకు ఏ ప్రమాదం ఉండదు నీవు క్షేమంగా ఉంటావు. 22అయితే బాణాలను నీకు అవతల వైపు ఉన్నాయని నేను వానితో చెప్తే పారిపొమ్మని యెహోవా చెప్తున్నారని తెలుసుకొని నీవు ప్రయాణమై వెళ్లిపోవాలి. 23అయితే మనమిద్దరం మాట్లాడుకున్న సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీకు నాకు మధ్య ఎల్లప్పుడు యెహోవాయే సాక్షి” అన్నాడు.
24కాబట్టి దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనానికి కూర్చున్నాడు. 25ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న తన స్థానంలో యోనాతానుకు ఎదురుగా కూర్చున్నాడు. అబ్నేరు సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది. 26“దావీదుకు ఏదో జరిగి అతడు ఆచారరీత్య అపవిత్రమై ఉంటాడు; ఖచ్చితంగా అతడు అపవిత్రుడు” అని సౌలు అనుకుని ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. 27అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు.
28అందుకు యోనాతాను, “బేత్లెహేము వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను దావీదు ఎంతో ప్రాధేయపడి, 29‘దయచేసి నన్ను వెళ్లనివ్వు, నా పట్టణంలో మా వంశస్థులు బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని నా అన్న నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా అన్నలను కలుసుకునేలా నన్ను వెళ్లనివ్వు’ అని నన్ను అడిగి వెళ్లాడు. ఆ కారణంగానే అతడు రాజు బల్ల దగ్గరకు రాలేదు” అని చెప్పాడు.
30అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా? 31యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీవు గాని నీ రాజ్యం గాని స్ధిరపడదు. కాబట్టి నీవు ఎవరినైనా పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, అతడు తప్పక చావాల్సిందే” అని చెప్పాడు.
32అప్పుడు యోనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని సౌలును అడిగాడు. 33కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు.
34యోనాతాను తీవ్రమైన కోపంతో బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందుకు అతని కోసం దుఃఖిస్తూ, ఆ అమావాస్య పండుగ మరుసటిరోజు అతడు భోజనం చేయలేదు.
35ఉదయాన యోనాతాను దావీదును కలుసుకోడానికి ఒక పనివానిని తీసుకుని పొలంలోనికి వెళ్లాడు. 36అతడు వానితో, “నీవు పరుగెత్తుకొని వెళ్లి నేను వేసే బాణాలను వెదుకు” అని చెప్పి వాడు పరుగెత్తుతున్నప్పుడు బాణం వాని అవతలకు వేశాడు. 37అయితే వాడు యోనాతాను వేసిన బాణం పడ్డ చోటికి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, “నీ అవతల బాణం ఉంది కదా? 38నీవు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్లు” అన్నాడు. పనివాడు బాణాలను ఏరుకుని తన యాజమాని దగ్గరకు వాటిని తీసుకువచ్చాడు. 39విషయం ఏమీ వానికి తెలియదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ విషయం తెలుసు. 40యోనాతాను తన ఆయుధాలను వాని చేతికిచ్చి వీటిని పట్టణానికి తీసుకెళ్లమని చెప్పి వానిని పంపివేశాడు.
41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు బండ దక్షిణ దిక్కునుండి బయటకి వచ్చి యోనాతాను ఎదుట మూడుసార్లు మోకరించి తలవంచి నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. ఇలా ఉండగా దావీదు మరింత గట్టిగా ఏడ్చాడు.
42అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 20: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.