2 దినవృత్తాంతములు 24
24
యోవాషు మందిరాన్ని మరమ్మత్తు చేయించుట
1యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది. 2యాజకుడైన యెహోయాదా బ్రతికిన కాలమంతా యోవాషు యెహోవా దృష్టికి సరియైనదే చేశాడు. 3యెహోయాదా యోవాషుకు ఇద్దరు స్త్రీలతో పెళ్ళి చేశాడు, అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు.
4కొంతకాలం తర్వాత యోవాషు యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. 5అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, “మీ దేవుని మందిరాన్ని మరమ్మత్తు చేయాలి కాబట్టి మీరు యూదా పట్టణాలకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరనుండి ప్రతి సంవత్సరం రావలసిన డబ్బును సేకరించండి. అది వెంటనే చేయండి” అని ఆదేశించాడు. కాని లేవీయులు వెంటనే చేయలేదు.
6కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు.
7ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరంలోకి చొరబడి దానిలోని పవిత్ర వస్తువులను కూడా బయలు కోసం ఉపయోగించారు.
8రాజు ఆజ్ఞ ప్రకారం, ఒక పెట్టెను తయారుచేసి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. 9దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇశ్రాయేలీయులకు విధించిన పన్నును వారు యెహోవాకు తీసుకురావాలని యూదాలో యెరూషలేములో ప్రకటించారు. 10దానికి అధికారులంతా ప్రజలంతా సంతోషించి, వారి కానుకలు తెచ్చి పెట్టె నిండేవరకు అందులో వేశారు. 11అప్పుడప్పుడు లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరకు తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి, పెట్టె ఖాళీచేసి దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా వారు ప్రతిదినం చేయడం వలన వారు చాలా డబ్బు పోగుచేశారు. 12రాజు యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిరంలో అవసరమైన పనులు చేసేవారికి ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి తాపీ మేస్త్రీలను, వడ్లవారిని, మందిరాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతో ఇత్తడితో పనిచేసేవారిని జీతానికి తీసుకున్నారు.
13పనివారు శ్రద్ధగా పని చేస్తుంటే వారి ఆధ్వర్యంలో మరమ్మత్తులు ముందుకు కొనసాగాయి. వారు దేవుని మందిరాన్ని దాని అసలు నమూనా ప్రకారం పునర్నిర్మించి దానిని పటిష్టం చేశారు. 14పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి.
15యెహోయాదా వయస్సు నిండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు. 16అతడు ఇశ్రాయేలులో దేవునికి, ఆయన మందిరానికి చేసిన మేలును బట్టి దావీదు పట్టణంలో రాజులతో పాటు పాతిపెట్టబడ్డాడు.
యోవాషు దుష్టత్వం
17యెహోయాదా మరణించిన తర్వాత, యూదా అధికారులు వచ్చి రాజుకు నమస్కరించగా అతడు వారి మాట విన్నాడు. 18అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది. 19అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు.
20ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు.
21అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది. 22జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు.
23ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు. 24వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు. 25సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు.
26అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు,#24:26 జాబాదు మరో రూపం యోజాబాదు మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు. 27యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 24: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.