2 దినవృత్తాంతములు 25

25
యూదా రాజైన అమజ్యా
1అమజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది. 2అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ హృదయమంతటితో ఆయనను అనుసరించలేదు. 3రాజ్యం తన ఆధీనంలో స్థిరపడిన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు. 4అయితే అతడు వారి సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు”#25:4 ద్వితీ 24:16 అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.
5అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను#25:5 సహస్రాధిపతులుగాను అంటే వేయిమంది సైనికులపై అధిపతులుగాను శతాధిపతులుగాను#25:5 శతాధిపతులుగాను అంటే, వందమంది సైనికులపై అధిపతులుగాను నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు. 6అతడు ఇశ్రాయేలు నుండి వంద తలాంతుల#25:6 అంటే, సుమారు 3.34 టన్నులు; 9 వచనంలో కూడా వెండికి లక్ష మంది పోరాట యోధులను కిరాయికి తీసుకున్నాడు.
7అయితే ఒక దైవజనుడు అమజ్యా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “రాజా, ఇశ్రాయేలు సైనికులు నీతో తీసుకెళ్లకు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలీయులతో గాని, ఎఫ్రాయిం వారిలో ఎవ్వరితో గాని లేరు. 8ఒకవేళ మీరు వెళ్లి ధైర్యంగా యుద్ధం చేసినా, దేవుడు మిమ్మల్ని శత్రువుల ముందు కూల్చివేస్తారు, ఎందుకంటే సహాయం చేయడానికైనా, కూల్చివేయడానికైనా దేవునికే శక్తి ఉంది.”
9అమజ్యా దైవజనుని చూసి, “కాని ఇశ్రాయేలు సైనికుల కోసం నేను చెల్లించిన వంద తలాంతుల సంగతేంటి?” అని అడిగాడు.
అందుకు దైవజనుడు, “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలరు” అని జవాబిచ్చాడు.
10కాబట్టి అమజ్యా ఎఫ్రాయిం నుండి తన దగ్గరకు వచ్చిన సైన్యాన్ని వేరుచేసి ఇంటికి పంపివేశాడు. అందుకు వారు యూదా మీద కోప్పడి తీవ్ర కోపంతో ఇంటికి వెళ్లిపోయారు.
11తర్వాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని ఉప్పు లోయకు నడిపించి అక్కడ 10,000 మంది శేయీరు వారిని చంపాడు. 12అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు.
13ఈలోగా అమజ్యా తనతో కూడా యుద్ధానికి రానివ్వకుండా పంపివేసిన ఇశ్రాయేలు సైనికులు సమరయ నుండి బేత్-హోరోను వరకు ఉన్న యూదా పట్టణాల మీద దాడిచేశారు. వారు 3,000 మందిని చంపి, పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును ఎత్తుకెళ్లారు.
14అమజ్యా ఎదోమీయులను హతమార్చి తిరిగి వచ్చినప్పుడు తమతో కూడా శేయీరు ప్రజల దేవుళ్ళను తెచ్చాడు. వాటిని తన సొంత దేవుళ్ళుగా నిలిపి, వాటి ఎదుట సాష్టాంగపడి వాటికి బలులు అర్పించాడు. 15అందువల్ల అమజ్యా మీద యెహోవాకు కోపం రగులుకుంది. యెహోవా ఒక ప్రవక్తను అమజ్యా దగ్గరకు పంపాడు. అతడు అమజ్యాతో, “ఈ దేవుళ్ళు తమ సొంత ప్రజలనే నీ చేతిలో పడకుండా కాపాడలేకపోయారు. నీవు వారి దేవుళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు?” అని అడిగాడు.
16ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు.
అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు.
17యూదా రాజైన అమజ్యా ఇతరులతో ఆలోచన చేశాక, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషుకు సవాలు విసిరాడు.
18అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది. 19నీవు ఎదోమును ఓడించి నీలో నీవు గర్విస్తున్నావు. అయితే ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”
20అయితే అమజ్యా వినలేదు, ఎందుకంటే వారు ఎదోము దేవుళ్ళను వెదకడం వల్ల దేవుడు వారిని యెహోయాషు చేతికి అప్పగించబడేలా చేశారు. 21కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 22ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు. 23ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా#25:23 హెబ్రీలో యెహోయాహాజు మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు అతన్ని యెరూషలేముకు తెచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు#25:23 అంటే, సుమారు 180 మీటర్లు పడగొట్టాడు. 24అతడు దేవుని మందిరంలో ఓబేద్-ఎదోము సంరక్షణలో ఉన్న కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని, రాజభవన ఖజానాను బందీలను తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
25యెహోయాహాజు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు. 26అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా? 27అమజ్యా యెహోవాను వెంబడించడం మానివేసిన సమయం నుండి ప్రజలు యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు. 28అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యూదా#25:28 కొ.ప్ర.లలో దావీదు; 2 రాజులు 14:20 లో కూడా ఉంది. పట్టణంలో అతని పూర్వికుల దగ్గర పాతిపెట్టారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 25: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి