2 దినవృత్తాంతములు 32
32
యెరూషలేమును భయపెట్టిన సన్హెరీబు
1హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అతడు తన కోసం స్వాధీనం చేసుకోవాలని ఆలోచించి, కోటగోడలున్న పట్టణాలను ముట్టడించాడు. 2సన్హెరీబు వచ్చాడని, అతడు యెరూషలేముపై యుద్ధం చేయాలనుకున్నాడని హిజ్కియా చూసినప్పుడు, 3అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు. 4వారు పెద్ద గుంపుగా చేరి, “అష్షూరు రాజులు వచ్చి ఇక్కడ పుష్కలమైన నీరు ఉన్నట్లు తెలుసుకోవడం ఎందుకు?” అనుకుని ఆ ప్రాంతం గుండా ప్రవహించే నీటి ఊటలన్నిటిని, ప్రవాహాన్ని అడ్డుకున్నారు. 5అప్పుడు అతడు గోడలో విరిగిన భాగాలన్నిటినీ మరమ్మత్తు చేసి, దానిపై బురుజులను నిర్మించాడు. అతడు దాని బయట మరొక గోడను కట్టించి, దావీదు నగరం మిద్దెలను బలోపేతం చేశాడు. అతడు పెద్ద సంఖ్యలో ఆయుధాలు డాళ్ళు కూడా తయారు చేయించాడు.
6అతడు ప్రజలపై సైనిక అధికారులను నియమించి పట్టణ ద్వారం దగ్గర ఉన్న కూడలిలో తన ముందుకు వారిని పిలిపించి వారినిలా హెచ్చరించాడు: 7“బలంగా ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజును అతనితో ఉన్న పెద్ద సైన్యాన్ని చూసి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. అతని దగ్గర కన్నా మన దగ్గర గొప్ప శక్తి ఉంది. 8అతనికి కేవలం మానవ బలం మాత్రమే ఉంది,#32:8 లేదా సైనిక శక్తి కానీ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలలో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనతో ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలనుబట్టి ధైర్యం తెచ్చుకున్నారు.
9తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు అతని సైన్యాలన్నీ లాకీషును ముట్టడించినప్పుడు, అతడు యూదా రాజైన హిజ్కియాకు అక్కడ ఉన్న యూదా ప్రజలందరికి ఈ సందేశం ఇవ్వడానికి తన అధికారులను యెరూషలేముకు పంపాడు:
10“అష్షూరు రాజు సన్హెరీబు ఇలా అంటున్నాడు: మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో ఉన్నారు. దేన్ని చూసుకుని మీకు ఈ ధైర్యం? 11హిజ్కియా, ‘మన దేవుడైన యెహోవా మనలను అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాడు’ అని చెప్తున్నాడంటే, మీరు ఆకలితో దాహంతో చనిపోయేలా అతడు మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. 12హిజ్కియా స్వయంగా ఈ దేవుని ఉన్నత స్థలాలను బలిపీఠాలను తొలగించి, యూదా వారితో యెరూషలేము వారితో, ‘మీరు ఒక్క బలిపీఠం దగ్గర ఆరాధించి దానిపై బలులు అర్పించాలి’ అని చెప్పలేదా?
13“నేను నా పూర్వికులు ఇతర దేశాల ప్రజలందరికి ఏమి చేశామో మీకు తెలియదా? ఆ దేశాల దేవుళ్ళు ఎప్పుడైనా తమ దేశాన్ని నా చేతిలో నుండి విడిపించుకోగలిగారా? 14ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ ప్రజలను నా నుండి రక్షించగలిగారా? అలాంటప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి ఎలా విడిపించగలడు? 15ఇప్పుడు హిజ్కియా మిమ్మల్ని మోసం చేసి ఇలా తప్పుత్రోవ పట్టనివ్వకండి. అతన్ని నమ్మవద్దు, ఎందుకంటే ఏ దేశానికి ఏ రాజ్యానికి చెందిన ఏ దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలో నుండి గాని నా పూర్వికుల చేతి నుండి గాని రక్షించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం అసాధ్యం!”
16సన్హెరీబు అధికారులు దేవుడైన యెహోవాకు ఆయన సేవకుడైన హిజ్కియాకు వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు. 17రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హేళన చేస్తూ ఉత్తరాలు వ్రాసి ఆయనకు వ్యతిరేకంగా ఇలా అన్నాడు: “ఇతర దేశాల ప్రజల దేవతలు తమ ప్రజలను నా చేతిలో నుండి రక్షించనట్లే, హిజ్కియా దేవుడు తన ప్రజలను నా చేతి నుండి రక్షించలేడు.” 18అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేముకు ప్రజలను బెదిరించడానికి భయపెట్టడానికి హెబ్రీ భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. 19వారు భూమిమీద ఇతర జనాంగాల కోసం మనుష్యులు తయారుచేసిన దేవతల గురించి మాట్లాడినట్లు యెరూషలేము యొక్క దేవుని గురించి మాట్లాడారు.
20రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు. 21యెహోవా ఒక దూతను పంపారు. అతడు అష్షూరు రాజు శిబిరంలో ఉన్న పోరాట యోధులందరినీ, అధిపతులను, అధికారులందరినీ నాశనం చేశాడు. కాబట్టి అష్షూరురాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు, అతని కుమారులలో కొందరు ఖడ్గంతో అతన్ని నరికివేశారు.
22కాబట్టి యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజు సన్హెరీబు చేతి నుండి ఇతరులందరి చేతిలో నుండి రక్షించారు. ఆయన అన్ని వైపుల నుండి వారిని కాపాడారు. 23చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు విలువైన వస్తువులు తెచ్చారు. అందువల్ల అతడు అప్పటినుండి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.
హిజ్కియా గర్వం, విజయం, మరణం
24ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థించగా ఆయన అతనితో మాట్లాడి, అతనికి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడు. 25అయితే హిజ్కియా గర్వించి తన పట్ల చూపిన దయకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది. 26అయితే చివరకు హిజ్కియా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తాను యెరూషలేము నివాసులు తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజలమీదికి రాలేదు.
27హిజ్కియాకు గొప్ప సంపదలు ఘనత లభించాయి. వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, సుగంధద్రవ్యాలు, డాళ్లు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు. 28ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె నిల్వ ఉంచడానికి గిడ్డంగులు కట్టించాడు. వివిధ రకాల పశువులకు శాలలు, మందలకు దొడ్లు కట్టించాడు. 29దేవుడు అతనికి అతివిస్తారమైన సంపద ఇచ్చారు కాబట్టి అతడు పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలు పశువుల మందలు అతడు సంపాదించాడు.
30ఈ హిజ్కియా గిహోను ఊట కాలువకు ఎగువన ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోను వర్ధిల్లాడు. 31అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పాలకులు అతని దగ్గరకు రాయబారులను పంపారు. అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టారు.
32హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, భక్తితో అతడు చేసిన పనులు ఆమోజు కుమారుడు ప్రవక్తయైన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ వ్రాయబడ్డాయి. 33హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు వారసుల శ్మశానభూమిలోని పై భాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదా వారంతా యెరూషలేము నివాసులంతా అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 32: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.