2 దినవృత్తాంతములు 34
34
యోషీయా యొక్క సంస్కరణలు
1యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు. 2అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
3అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు. 4అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు. 5ఆ దేవత పూజారుల ఎముకలను వారి బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు. 6మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో, 7అతడు బలిపీఠాలను అషేరా స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలను దేవతాస్తంభాలను ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ సూర్య దేవత విగ్రహాలన్నిటిని ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
8యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు.
9వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు. 10అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు అప్పచెప్పారు. వారు మందిరాన్ని మరమ్మతు చేస్తూ బాగుచేస్తున్న వారికి ఆ డబ్బును జీతంగా ఇచ్చారు. 11వారు యూదా రాజులు పాడుచేసిన భవనాలకు చెక్కిన రాళ్లు, చెక్కలు, దూలాలను కొనడానికి, వడ్రంగి వారికి, నిర్మించేవారికి ఆ డబ్బు ఇచ్చారు.
12ఆ మనుష్యులు నమ్మకంగా పని చేశారు. వారితో పని చేయించడానికి నియమించబడిన వారెవరంటే, మెరారీయులైన లేవీయులు యహతు, ఓబద్యా, కహాతు వంశంవారు జెకర్యా, మెషుల్లాము. పని చేయించడానికి నియమించబడిన లేవీయులందరు వాయిద్యాలు వాయించడంలో నైపుణ్యం కలవారు. 13వారు బరువులు మోసేవారి మీద, ప్రతి విధమైన పని చేసేవారి మీదా తనిఖీదారులుగా ఉన్నారు. లేవీయులలో కొంతమంది లేఖికులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు.
ధర్మశాస్త్ర గ్రంథం కనబడుట
14యెహోవా మందిరంలోకి తేబడిన డబ్బును వారు బయటకు తీసుకువస్తున్నప్పుడు, యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది. 15హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. అతడు దానిని షాఫానుకు ఇచ్చాడు.
16షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: “మీ అధికారులకు మీరు అప్పచెప్పిన పనులన్నీ చేస్తున్నారు. 17వారు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.” 18అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు” అని రాజుకు చెప్పాడు. షాఫాను దానిని రాజు సముఖంలో చదివాడు.
19ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకున్నాడు. 20తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు: 21“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ఇశ్రాయేలు యూదాలో శేషించిన వారి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు యెహోవా మాటను పాటించలేదు; ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ప్రవర్తించలేదు.”
22అప్పుడు హిల్కీయా, రాజు పంపినవారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తోఖతు#34:22 తిక్వా అని కూడా పిలువబడేవాడు కుమారుడు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా#34:22 హర్హషు అని కూడా పిలువబడేవాడు మనుమడు. ఆమె యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
23ఆమె వారితో ఇలా అన్నది, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి, 24‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు సమక్షంలో చదివించిన గ్రంథంలో వ్రాసి ఉన్న శాపాలన్నిటిని అలాగే విపత్తును నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను. 25ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’ 26యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: 27వారు ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం మెత్తబడి నిన్ను నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు. 28నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి, ఇక్కడ నివసించేవారి మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు.’ ”
అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
29అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. 30అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, లేవీయులతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు. 31రాజు తన స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలకు లోబడతానని యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు.
32అప్పుడు యెరూషలేములో, బెన్యామీనులో ఉన్నవారందరిని ఆ నిబంధనకి సమ్మతించేటట్టు చేశాడు. యెరూషలేమువారు తమ పూర్వికుల దేవుని నిబంధన ప్రకారం అలా చేశారు.
33యోషీయా ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ప్రాంతమంతటిలో నుండి విగ్రహాలన్నిటిని తీసివేశాడు. అవి అసహ్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలులో ఉన్నవారందరు తమ దేవుడైన యెహోవాను సేవించేటట్టు చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 34: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.