2 దినవృత్తాంతములు 5

5
1రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి, యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.
మందసాన్ని మందిరానికి తీసుకురావడం
2అప్పుడు సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేముకు పిలిపించాడు. 3ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజు ఎదుట సమావేశమయ్యారు.
4ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, లేవీయులు నిబంధన మందసాన్ని తీసుకుని, 5మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. లేవీయులైన యాజకులు వాటిని పైకి మోసుకెళ్లారు; 6రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
7తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు. 8కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపి మందసాన్ని దానిని మోసే కర్రలను కప్పివేశాయి. 9ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు మందసం నుండి విస్తరించి, గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి. 10మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
11తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. 12సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు. 13బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి:
“యెహోవా మంచివాడు.
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది”
అని పాడారు.
అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది. 14యెహోవా మహిమ దేవుని మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 5: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి