2 రాజులు 11

11
అతల్యా యోవాషు
1అహజ్యా తల్లి అతల్యా, తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది. 2కాని, అహజ్యా సోదరీ రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచి అతన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు. 3అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు యెహోవా మందిరంలో అతని దాదితో దాగి ఉన్నాడు.
4ఏడవ సంవత్సరంలో యెహోయాదా రాజభవనం శతాధిపతులను, కేరీతీయులను, సంరక్షకులను పిలిపించి వారిని యెహోవా మందిరంలో తీసుకెళ్లి వారితో నిబంధన చేసి వారిచేత యెహోవా మందిరం దగ్గర ప్రమాణం చేయించిన తర్వాత వారికి రాజు కుమారున్ని చూపెట్టాడు. 5అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు, “మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే వారిలో మూడవ వంతు వచ్చి రాజభవనాన్ని కాపలా కాయాలి. 6ఇంకొక మూడవ భాగం సూరు ద్వారం దగ్గర, మరో మూడవ భాగం కాపలాకు వెనుక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి. 7మీలో సబ్బాతు దినాన్న పనిలో లేనివారు యెహోవా మందిరాన్ని, రాజును కాపలా కాయాలి. 8మీలో ప్రతి ఒక్కరూ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మీ వరుసలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.”
9యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే ఆ శతాధిపతులు చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారితో పాటు యాజకుడైన యెహోయాదా దగ్గరకు తీసుకువచ్చారు. 10అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న రాజైన దావీదుకు చెందిన ఈటెలు, డాళ్లు ఆ శతాధిపతులకు ఇచ్చాడు. 11కావలివారు ప్రతి ఒక్కరూ ఆయుధం చేతపట్టుకుని, యెహోవా మందిరం దక్షిణ వైపు నుండి ఉత్తర వైపు వరకు, బలిపీఠం దగ్గర రాజు చుట్టూ నిలబడ్డారు.
12యెహోయాదా రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి, అతని తలమీద కిరీటం పెట్టాడు; అతడు నిబంధన ప్రతిని అతనికి అందించి, అతన్ని రాజుగా ప్రకటించాడు. వారు అతన్ని అభిషేకించారు, ప్రజలు చప్పట్లు కొడుతూ, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు.
13కావలివారు, ప్రజలు చేసే శబ్దాన్ని అతల్యా విన్నప్పుడు, ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లింది. 14ఆమె చూడగా, అక్కడ ఆచారం ప్రకారం రాజు అధికార స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అధిపతులు, బూరలు ఊదేవారు రాజు ప్రక్కన ఉన్నారు, దేశ ప్రజలంతా సంబరపడుతూ, బూరలు ఊదుతూ ఉన్నారు. అప్పుడు అతల్యా తన వస్త్రాలు చింపుకొని, “ద్రోహం! ద్రోహం!” అని అరిచింది.
15అప్పుడు యాజకుడైన యెహోయాదా దళాల మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను, “మీ వరుసల మధ్య నుండి ఆమెను బయటకు తీసుకురండి, ఎవరైనా ఆమె వెంట వస్తే ఖడ్గంతో చంపేయండి” అని ఆదేశించాడు. ఎందుకంటే యాజకుడు, “యెహోవా మందిరం దగ్గర ఆమె చంపబడకూడదు” అని చెప్పాడు. 16కాబట్టి ఆమె గుర్రాలు రాజభవన ఆవరణంలోనికి ప్రవేశించే స్థలానికి చేరుకోగానే వారు ఆమెను పట్టుకుని చంపేశారు.
17అప్పుడు యెహోయాదా తాను, ప్రజలంతా యెహోవా ప్రజలుగా ఉంటారని యెహోవాకు, రాజుకు, ప్రజలకు మధ్య నిబంధన చేశాడు. రాజుకు ప్రజలకు మధ్య కూడా నిబంధన చేశాడు. 18దేశ ప్రజలందరూ బయలు గుడి దగ్గరకు వెళ్లి దానిని పడగొట్టారు. వారు బలిపీఠాలను, విగ్రహాలను ముక్కలుగా పగులగొట్టారు, బలిపీఠాల ముందున్న బయలు యాజకుడైన మత్తానును చంపారు.
అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా ఆలయానికి కావలివారిని నియమించాడు. 19అతడు తనతో శతాధిపతులను, సంరక్షకులను, కేరీతీయులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు కావలివారి ద్వారం గుండా వచ్చారు. అప్పుడు రాజు రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. 20అతల్యాను రాజభవనం దగ్గర చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు.
21యెహోయాషు#11:21 హెబ్రీలో యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 11: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి