2 రాజులు 13

13
ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు
1యూదారాజు అహజ్యా కుమారుడైన యోవాషు పరిపాలనలోని ఇరవై మూడవ సంవత్సరంలో యెహు కుమారుడు యెహోయాహాజు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. 2అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు. 3కాబట్టి యెహోవాకు ఇశ్రాయేలు మీద కోపం రగులుకుంది, చాలాసార్లు ఆయన వారిని అరాము రాజైన హజాయేలు, అతని కుమారుడు బెన్-హదదు చేతులకు అప్పగించారు.
4అప్పుడు యెహోయాహాజు యెహోవాను వేడుకోగా, యెహోవా అతన్ని ప్రార్థన విన్నారు, ఎందుకంటే అరాము రాజు ఇశ్రాయేలును ఎలా తీవ్రంగా హింసిస్తున్నాడో చూశారు. 5యెహోవా ఇశ్రాయేలుకు ఒక రక్షకుని ప్రసాదించారు, అతని ద్వారా వారు అరాము అధికారం నుండి తప్పించుకున్నారు. కాబట్టి మునుపటిలా ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళలో నివసించారు. 6అయితే వారు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాక, అషేరా స్తంభం అలాగే సమరయలో నిలిచి ఉంది.
7యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.
8యెహోయాహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 9యెహోయాహాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాషు#13:9 హెబ్రీలో యోవాషు; 12-14, 25 వచనాల్లో కూడా రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు
10యూదా రాజైన యోవాషు పరిపాలనలోని ముప్పై ఏడవ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. 11అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను చేస్తూనే ఉన్నాడు.
12యెహోయాషును పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 13యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, యరొబాము అతని స్థానంలో సింహాసనం ఎక్కాడు. యెహోయాషును సమరయలో ఇశ్రాయేలు రాజులతో పాటు సమాధి చేశారు.
14ఆ కాలంలో ఎలీషాకు జబ్బుచేసింది, దానిని బట్టి తర్వాత అతడు చనిపోతాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతన్ని చూడడానికి వచ్చి అతన్ని చూసి, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు!” అని అంటూ ఏడ్చాడు.
15అతనితో ఎలీషా, “విల్లు, కొన్ని బాణాలు తీసుకో” అని చెప్పగా అతడు అలా చేశాడు. 16అతడు ఇశ్రాయేలు రాజుతో, “నీ చేతుల్లో విల్లును ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు ఎక్కుపెట్టిన తర్వాత ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచాడు.
17ఎలీషా, “తూర్పున ఉన్న కిటికీ తెరువు” అన్నాడు, అతడు తెరిచాడు. ఎలీషా, “బాణం విసురు” అన్నాడు, రాజు బాణం విసిరాడు. ఎలీషా, “ఇది యెహోవా విజయ బాణం, అరాము మీద విజయ బాణం! నీవు ఆఫెకు దగ్గర అరామీయులను పూర్తిగా నాశనం చేస్తావు” అని ప్రకటించాడు.
18తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు. 19దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.
20తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు.
అయితే ప్రతి వసంతకాలంలో మోయాబు దోపిడి మూకలు దేశంలోకి వచ్చేవారు. 21ఒకసారి కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని సమాధి చేస్తుండగా అకస్మాత్తుగా దోపిడి మూకను చూసి ఆ మనిషి శవాన్ని ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే, ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి తన కాళ్లమీద నిలబడ్డాడు.
22యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు. 23అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.
24అరాము రాజైన హజాయేలు చనిపోయాడు, అతని తర్వాత అతని కుమారుడైన బెన్-హదదు రాజయ్యాడు. 25అప్పుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అంతకుముందు హజాయేలు యెహోయాహాజుతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పట్టణాలను హజాయేలు కుమారుడైన బెన్-హదదు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మూడుసార్లు యెహోయాషు అతన్ని ఓడించి ఇశ్రాయేలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 13: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి