2 రాజులు 14

14
యూదా రాజైన అమజ్యా
1ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యూదారాజు యోవాషు కుమారుడైన అమజ్యా పరిపాలన ఆరంభించాడు. 2అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది. 3అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు. 4అయితే క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
5రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు. 6అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు”#14:6 ద్వితీ 24:16 అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.
7అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.
8తర్వాత అమజ్యా ఇశ్రాయేలు రాజూ యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు దగ్గరకు దూతలను పంపి, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని సవాలు చేశాడు.
9అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది. 10నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”
11అయితే అమజ్యా వినలేదు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా, యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 12ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు. 13ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు#14:13 అంటే, 180 మీటర్లు పడగొట్టాడు. 14అతడు యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని తీసుకున్నాడు. అతడు బందీలను కూడా తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
15యెహోయాషు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చర్రిత గ్రంథంలో వ్రాయబడలేదా? 16యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో ఇశ్రాయేలు రాజులతో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యరొబాము రాజయ్యాడు.
17యెహోయాహాజు కుమారుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు. 18అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
19యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు. 20అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యెరూషలేములో అతని పూర్వికుల దగ్గర దావీదు పట్టణంలో పాతిపెట్టారు.
21అప్పుడు యూదా ప్రజలంతా పదహారు సంవత్సరాల వయస్సుగల అమజ్యా కుమారుడైన అజర్యాను#14:21 ఉజ్జియా అని కూడా పిలువబడ్డాడు అతని తండ్రి స్థానంలో రాజుగా చేశారు. 22అమజ్యా రాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత, అజర్యా ఏలతు పట్టణాన్ని తిరిగి కట్టించి దానిని తిరిగి యూదా ఆధీనంలోకి చేర్చాడు.
ఇశ్రాయేలు రాజైన రెండవ యరొబాము
23యోవాషు కుమారుడు యూదా రాజైన అమజ్యా పరిపాలనలోని పదిహేనవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యరొబాము సమరయలో రాజయ్యాడు, అతడు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. 24అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు. 25అతడు లెబో హమాతు నుండి మృత సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దులను మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమిత్తయి కుమారుడు, గాత్-హెఫెరు నివాసియైన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా పలికిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.
26యెహోవా ఇశ్రాయేలులో అందరు అంటే బానిసలు స్వతంత్రులు ఎంత ఘోరంగా బాధ పడుతున్నారో చూశారు; వారికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. 27ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద లేకుండా తుడిచి వేస్తానని యెహోవా చెప్పలేదు, కాబట్టి వారిని యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా రక్షించాడు.
28యరొబాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, అతని సైనిక విజయాలు, ఇశ్రాయేలు కోసం అతడు యూదాకు చెందని దమస్కును, హమాతును ఎలా పునరుద్ధరించాడో, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా? 29యరొబాము తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులతో పాటు నిద్రించాడు, అతని తర్వాత అతని కుమారుడైన జెకర్యా రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 14: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి