2 రాజులు 15

15
యూదా రాజైన అజర్యా
1ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలన యొక్క ఇరవై ఏడవ సంవత్సరంలో, యూదారాజు అమజ్యా కుమారుడైన అజర్యా పరిపాలన ఆరంభించాడు. 2అతడు రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా; ఆమె యెరూషలేముకు చెందినది. 3అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 4అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
5యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
6అజర్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 7అజర్యా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన జెకర్యా
8యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలుకు సమరయలో రాజయ్యాడు, అతడు ఆరు నెలలు పరిపాలించాడు. 9అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
10యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు. 11జెకర్యా గురించిన ఇతర విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 12కాబట్టి యెహోవా యెహుతో చెప్పిన ఈ మాట నెరవేర్చబడింది: “నీ సంతానం నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”#15:12 2 రాజులు 10:30
ఇశ్రాయేలు రాజైన షల్లూము
13యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు. 14అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
15షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
16ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.
ఇశ్రాయేలు రాజైన మెనహేము
17యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు. 18అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన ఏలుబడి అంతటిలో, ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
19తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల#15:19 అంటే, సుమారు 38 టన్నులు వెండిని ఇచ్చాడు. 20ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ#15:20 అంటే, సుమారు 575 గ్రాములు వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.
21మెనహేము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 22మెనహేము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతని తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహ్య
23యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరంలో, మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 24పెకహ్యా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు. 25అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
26పెకహ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
ఇశ్రాయేలు రాజైన పెకహు
27యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభై రెండవ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు. 28అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
29ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు. 30తర్వాత ఏలా కుమారుడైన హోషేయ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేశాడు. ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలన యొక్క ఇరవయ్యవ సంవత్సరంలో అతడు పెకహు మీద దాడి చేసి, అతన్ని చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.
31పెకహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
యూదా రాజైన యోతాము
32ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో, యూదారాజు, ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలించడం ఆరంభించాడు. 33అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష, ఆమె సాదోకు కుమార్తె. 34అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 35అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు.
36యోతాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 37(ఆ రోజుల్లో యెహోవా యూదా మీదికి అరాము రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును పంపించడం మొదలుపెట్టారు.) 38యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని దావీదు పట్టణంలో, తన తండ్రి పట్టణంలో, వారితో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి