2 రాజులు 25

25
1కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరి పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించాడు. 2సిద్కియా రాజు ఏలుబడిలో పదకొండవ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంది.
3నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది. 4పట్టణ గోడలు పడగొట్టి బబులోనీయులు పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా రాత్రివేళ రాజు తోట సమీపంలోని రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా వారు పట్టణాన్ని విడిచిపోయారు. వారు అరాబా#25:4 లేదా యొర్దాను లోయ వైపు పారిపోయారు. 5అయితే బబులోను సైన్యం రాజును వెంటాడి యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు. 6అతడు పట్టుబడ్డాడు.
అతన్ని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు. 7అతడు సిద్కియా కుమారులను అతని కళ్లముందే చంపించాడు. తర్వాత అతని కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
8బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, ఏడవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. 9అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు. 10రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలను పడగొట్టారు. 11రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన సామాన్య ప్రజలతో పాటు బందీలుగా తీసుకెళ్లాడు. 12అయితే అతడు ద్రాక్షతోటల్లో, పొలాల్లో పని చేయడానికి దేశంలోని కొంతమంది నిరుపేద ప్రజలను విడిచిపెట్టాడు.
13బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, కదిలే పీటలను ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు. 14వారు కుండలు, గడ్డపారలు, వత్తులు కత్తిరించే కత్తెరలను, గిన్నెలు ఆలయ సేవలో ఉపయోగించే అన్ని ఇత్తడి వస్తువులను కూడా తీసుకెళ్లారు. 15రాజ రక్షక దళాధిపతి ధూపార్తులను, చిలకరింపు పాత్రలను తీసుకెళ్లాడు. అవన్నీ మేలిమి బంగారంతో వెండితో చేసినవి.
16యెహోవా మందిరం కోసం సొలొమోను చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, కదిలే పీటలకున్న ఇత్తడి తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి. 17ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు.#25:17 అంటే, సుమారు 8.1 మీటర్లు ఒక స్తంభం మీద ఉన్న ఇత్తడి పీట ఎత్తు మూడు మూరలు,#25:17 అంటే, సుమారు 1.4 మీటర్లు దాని చుట్టూ అల్లికపనితో, ఇత్తడితో చేసిన దానిమ్మ పండ్లతో అలంకరించబడింది. ఇంకొక స్తంభం కూడా, అల్లికతో అలాగే ఉంది.
18రాజ రక్షక దళాధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను, ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాజకుడైన జెఫన్యాను, ముగ్గురు ద్వారపాలకులను ఖైదీలుగా తీసుకెళ్లాడు. 19పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి, అతడు సైనికుల అధికారిని, అయిదుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు. 20రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. 21హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు.
కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా కొనిపోబడింది.
22బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు. 23బబులోను రాజు గెదల్యాను అధికారిగా నియమించాడని సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విని, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారుడైన యోహానాను, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మయకాతీయుని కుమారుడైన యాజన్యా వారి మనుష్యులు వచ్చారు. 24గెదల్యా వారికి, వారి మనుష్యులకు ఇలా ప్రమాణం చేశాడు, “బబులోను అధికారులకు భయపడకండి. దేశంలో స్థిరపడి, బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.”
25అయితే ఏడవ నెలలో రాజవంశానికి చెందిన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరకు వచ్చి అతన్ని, మిస్పాలో అతనితో ఉన్న యూదా వారిని, బబులోనీయులను చంపాడు. 26అప్పుడు బబులోనీయుల భయానికి చిన్నవారి నుండి గొప్పవారి వరకు, సైనికులు అధిపతులతో సహా ప్రజలంతా ఈజిప్టుకు పారిపోయారు.
యెహోయాకీను విడుదల
27యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, పన్నెండవ నెల, ఇరవై ఏడవ రోజున ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, అతడు యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడిపించాడు. 28అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు. 29కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు. 30అతడు బ్రతికి ఉన్నంత కాలం, రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 25: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి