2 రాజులు 5

5
నయమానుకు కుష్ఠు నుండి స్వస్థత
1అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి#5:1 హెబ్రీలో అనే పదం రకరకాల చర్మ వ్యాధులను సూచిస్తుంది..
2అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది. 3ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.
4నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు. 5అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల#5:5 అంటే, 340 కి. గ్రా. లు వెండి, ఆరువేల షెకెళ్ళ#5:5 అంటే, 69 కి. గ్రా. లు బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు. 6అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు తీసుకెళ్లిన ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఈ ఉత్తరంతో పాటు నా సేవకుడైన నయమానును నీ దగ్గరకు పంపిస్తున్నాను, అతనికి ఉన్న కుష్ఠును మీరు బాగుచేయాలని కోరుతున్నాను.”
7ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు.
8దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.” 9కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు. 10ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు.
11అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను. 12ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.
13నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు. 14కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది.
15అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”
16ప్రవక్త, “నేను సేవించే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేనేమి తీసుకోను” అని జవాబిచ్చాడు. నయమాను ఎంత బలవంతం చేసినా అతడు తీసుకోలేదు.
17నయమాను ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే, దయచేసి మీ దాసుడనైన నాకు కంచరగాడిదలు మోసేటంత మట్టి ఇప్పించండి, ఎందుకంటే యెహోవాకే దహనబలులు, అర్పణలు, అర్పిస్తాను గాని, మరి ఏ దేవునికి అర్పించను. 18అయితే ఒక్క విషయంలో యెహోవా మీ దాసుడనైన నన్ను క్షమించాలి: నా యజమానుడు మ్రొక్కుకోడానికి రిమ్మోను గుడిలోకి వెళ్తూ నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దాసుడనైన నన్ను యెహోవా క్షమించును గాక” అని అన్నాడు.
19ఎలీషా అన్నాడు, “సమాధానంతో వెళ్లు.”
నయమాను కొద్ది దూరం వెళ్లిన తర్వాత, 20ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని అరామీయుడైన నయమాను తెచ్చిన కానుక తీసుకోకుండా ఊరికే వెళ్లనిచ్చాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను అతని వెంట పరిగెత్తి అతని నుండి ఏదైనా తీసుకుంటాను” అని తన మనస్సులో అనుకున్నాడు.
21కాబట్టి గేహజీ నయమాను వెనకే త్వరగా వెళ్లాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం గమనించి రథం దిగి అతన్ని కలుసుకొని, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.
22గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు#5:22 అంటే, 34 కి. గ్రా. లు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.
23అందుకు నయమాను, “నీకిష్టమైతే రెండు తలాంతుల వెండి తీసుకో” అని చెప్పి గేహజీని బలవంతంగా ఒప్పించి రెండు సంచుల్లో నుండి రెండు తలాంతుల వెండి, రెండు జతల దుస్తులు పెట్టి, తన సేవకులలో ఇద్దరికి ఇస్తే వారు గేహజీకి ఇవ్వడానికి మోసుకెళ్లారు. 24గేహజీ కొండ దగ్గరకు చేరగానే అతడు వాటిని ఆ సేవకుల దగ్గర నుండి తీసుకుని వెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత అతడు ఆ మనుష్యులను పంపించేశాడు.
25అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు.
“మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.
26అయితే ఎలీషా అతనితో అన్నాడు, “ఆ మనిషి నిన్ను కలుసుకోడానికి రథం దిగి నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా లేదా? డబ్బు, దుస్తులు, ఒలీవచెట్లు, ద్రాక్షతోటలు, మందలు, పశువులు, దాసదాసీలు తీసుకోవడానికి ఇది సమయమా? 27నయమాను కుష్ఠు నీకు, నీ సంతానానికీ నిత్యం ఉంటుంది” అని అన్నాడు. వెంటనే గేహజీ చర్మమంతా కుష్ఠు వచ్చి మంచులా తెల్లగా అయ్యింది. అతడు ఎలీషా దగ్గర నుండి వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 5: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి