2 రాజులు 9
9
యెహు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడుట
1ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు. 2అక్కడికి వెళ్లి నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు కోసం వెదుకు. అతని దగ్గరకు వెళ్లి తన స్నేహితుల మధ్య నుండి పిలిచి అతన్ని లోపలి గదిలోకి తీసుకెళ్లు. 3అప్పుడు ఈ నూనె సీసా తీసుకుని నూనె అతని తలమీద పోసి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించాను’ అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండ తలుపు తెరిచి పారిపో!”
4కాబట్టి ఆ యువ ప్రవక్త రామోత్ గిలాదుకు వెళ్లాడు. 5అతడు చేరినప్పుడు, సైన్య అధికారులు ఒకచోట కూర్చుని ఉన్నారు. అతడు, “మీతో ఒక మాట చెప్పాలి” అని సైన్యాధిపతితో అన్నాడు.
అందుకు యెహు, “మాలో ఎవరికి?” అని అడిగాడు.
అందుకతడు, “అధిపతీ మీకే” అని జవాబిచ్చాడు.
6యెహు లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు, ఆ ప్రవక్త అతని తలమీద నూనె పోసి అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను ఇశ్రాయేలు ప్రజలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను. 7నీవు నీ యజమాని అహాబు వంశీకులను హతం చేయాలి, యెజెబెలు ద్వారా నా సేవకులైన ప్రవక్తలు, యెహోవా సేవకులందరి రక్తం చిందింపబడింది కాబట్టి నేను ప్రతీకారం తీసుకుంటాను. 8అహాబు వంశం పూర్తిగా నశిస్తుంది. ఇశ్రాయేలులో అహాబుకు చెందిన ప్రతి చివరి మగవారిని వారు బానిసలైనా పౌరులైనా నిర్మూలం చేస్తాను. 9నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను. 10యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.
11యెహు తన తోటి అధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారిలో ఒకరు, “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు.
అందుకు యెహు అన్నాడు, “అతడు, అతని మాటలు మీకు తెలుసు కదా.”
12వారు అన్నారు, “అది నిజం కాదు, అసలేం జరిగిందో మాకు చెప్పు.”
యెహు అన్నాడు, “అతడు నాతో ఇలా అన్నాడు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.’ ”
13వెంటనే వారు తమ వస్త్రాలను తీసి యెహు కాళ్లక్రింద పరిచారు. తర్వాత వారు బూర ఊది, “యెహు రాజయ్యాడు” అని కేకలు వేశారు.
యెహు, యోరాము, అహజ్యాలను చంపుట
14నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు యోరాము మీద కుట్ర చేశాడు. (ఆ సమయంలో యోరాము, ఇశ్రాయేలీయులంతా అరాము రాజైన హజాయేలు నుండి రామోత్ గిలాదును కాపలా కాస్తూ ఉన్నారు, 15కాని, రాజైన యెహోరాము అరాము రాజైన హజాయేలుతో యుద్ధంలో అరామీయుల వల్ల తగిలిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి తిరిగి వెళ్లాడు.) అప్పుడు యెహు, “మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే, ఈ విషయాన్ని యెజ్రెయేలుకు వెళ్లి చెప్పడానికి ఇక్కడినుండి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి” అన్నాడు. 16అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.
17యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు.
అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.
18ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ”
“సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.”
కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.
19కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు.
అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.
20కావలివాడు, “అతడు వారిని చేరుకున్నాడు, కాని అతడు కూడా తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడవడం నిమ్షీ మనుమడు యెహు నడిచినట్లు ఉంది, వెర్రిపట్టినవానిలా తోలుతున్నాడు” అని తెలియజేశాడు.
21యెహోరాము, “నా రథం సిద్ధం చెయ్యండి” అని ఆదేశించాడు. అది సిద్ధం అయినప్పుడు, ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా యెహును ఎదుర్కోడానికి తమ రథాలతో బయలుదేరారు. వారు అతన్ని యెజ్రెయేలు పట్టణస్థుడైన నాబోతుకు చెందిన పొలంలో కలుసుకున్నారు. 22యెహోరాము యెహును చూడగానే, “సమాధానంతో వచ్చావా, యెహు?” అని అడిగాడు.
అందుకు యెహు, “మీ తల్లి యెజెబెలు విగ్రహారాధనను మంత్రవిద్యను ప్రోత్సహిస్తున్నంత కాలం, సమాధానం ఎలా ఉంటుంది?” అని జవాబిచ్చాడు.
23యెహోరాము అహజ్యాతో, “అహజ్యా, ఇది మోసం!” అని అంటూ తన రథం త్రిప్పి పారిపోయాడు.
24అయితే యెహు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి యెహోరాము భుజాల మధ్యకు కొట్టాడు. ఆ బాణం అతని గుండెను చీల్చుకుంటూ పోవడం వలన అతడు తన రథంలో వాలిపోయాడు. 25అప్పుడు యెహు తన రథసారధియైన బిద్కరుతో అన్నాడు, “అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు పొలంలో పడవేయి. ఒకసారి మనమిద్దరం రథమెక్కి అతని తండ్రి అహాబు వెంట పడుతున్నప్పుడు, యెహోవా అహాబు గురించి చెప్పిన ప్రవచనం జ్ఞాపకం చేసుకో: 26‘నిన్నటి రోజు నేను నాబోతు రక్తం అతని కుమారుల రక్తం చూశాను, ఖచ్చితంగా ఈ పొలంలోనే నీకు ప్రతీకారం చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.’#9:26 1 రాజులు 21:19 చూడండి కాబట్టి ఇప్పుడు అతన్ని ఎత్తి ఆ పొలంలో పడవెయ్యి.”
27జరిగినదంతా యూదా రాజైన అహజ్యా చూసినప్పుడు, అతడు బేత్-హగ్గాన్ మార్గం గుండా పారిపోయాడు. యెహు అతని వెంటపడి, “అతన్ని కూడా చంపండి!” అని ఆజ్ఞాపించాడు. వారు గూరుకు పోయే త్రోవలో ఇబ్లెయాము దగ్గర అతన్ని తన రథంలో గాయపరిచారు, అయితే అతడు మెగిద్దోకు తప్పించుకుని వెళ్లి అక్కడ మృతిచెందాడు. 28అతని సేవకులు అతన్ని రథంలో యెరూషలేముకు తీసుకెళ్లి, దావీదు పట్టణంలో అతని పూర్వికుల దగ్గర అతన్ని సమాధి చేశారు. 29(అహాబు కుమారుడైన యోరాము పరిపాలన యొక్క పదకొండవ సంవత్సరంలో అహజ్యా యూదాకు రాజయ్యాడు.)
యెజెబెలు చంపబడుట
30తర్వాత యెహు యెజ్రెయేలుకు వెళ్లాడు. ఆ సంగతి యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకొని, తలను అలంకరించుకుని, కిటికీలో నుండి చూస్తూ ఉంది. 31యెహు ద్వారంలో ప్రవేశించగానే, యెజెబెలు అతనితో, “తన యజమానుని హత్యచేసిన జిమ్రీ లాంటివాడా, సమాధానంగా వస్తున్నావా?” అని అడిగింది.
32అతడు తన తల పైకెత్తి కిటికీవైపు చూసి, “నా పక్షంగా ఉన్నవారెవరు?” అని అరవగానే ఇద్దరు, ముగ్గురు నపుంసకులు క్రిందికి అతనివైపు చూశారు. 33అప్పుడు యెహు వారితో, “ఆమెను క్రిందికి త్రోసివేయండి” అని అరిచాడు. వెంటనే వారు ఆమెను త్రోసివేయగా ఆమె నేల మీద పడి, ఆమె రక్తం గోడపైన గుర్రాలపైన చిమ్మింది, యెహు తన రథాన్ని ఆమెపైకి ఎక్కించాడు.
34తర్వాత యెహు లోపలికి వెళ్లి భోజనం చేశాడు. అతడు వారికి, “ఈ శపితమైన స్త్రీ సంగతి చూడండి, ఈమె రాజకుమార్తె కాబట్టి ఈమె శవాన్ని పాతిపెట్టండి” అని ఆదేశించాడు. 35వెంటనే వారు ఆమెను పాతిపెట్టడానికి వెళ్లారు గాని ఆమె కపాలం, పాదాలు, అరచేతులు తప్ప ఏమీ కనిపించలేదు. 36వారు తిరిగివచ్చి యెహుకు విషయం చెప్పినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన సేవకుడైన తిష్బీయుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ఇది: యెజ్రెయేలులో ఈ నేల మీద యెజెబెలు శరీరాన్ని కుక్కలు తింటాయి.#9:36 1 రాజులు 21:23 చూడండి 37‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.