2 సమూయేలు 3

3
1సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది.
2దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు:
యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను అతని మొదటి కుమారుడు;
3కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు;
గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు;
4హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;
అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;
5దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.
వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు.
దావీదు దగ్గరకు వెళ్లిన అబ్నేరు
6సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు. 7అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు.
8ఇష్-బోషెతు అన్న మాటకు అబ్నేరుకు చాలా కోపం వచ్చి, “నేనేమైనా యూదా పక్షాన చేరిన కుక్కతో సమానమా? ఈ రోజు వరకు నీ తండ్రియైన సౌలు కుటుంబానికి, అతని బంధువులకు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. అయినా నీవు ఈ స్త్రీ కారణంగా నా మీద నిందవేస్తున్నావు. 9-10యెహోవా దావీదుకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్టుగా సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి, దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు మీద యూదా మీద దావీదు సింహాసనాన్ని నేను స్థాపించకపోతే, దేవుడు అబ్నేరుతో కఠినంగా వ్యవహరించును గాక” అని అన్నాడు. 11దానితో ఇష్-బోషెతు అబ్నేరుకు భయపడి అతన్ని మరో మాట అనడానికి సాహసించలేదు.
12అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు.
13అప్పుడు దావీదు, “మంచిది, నీతో ఒక ఒప్పందానికి వస్తాను కాని నీవు ఒక పని చేయాలి. నీవు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా దగ్గరకు తీసుకువస్తేనే నీవు నన్ను చూడగలవు” అని చెప్పాడు. 14ఆ తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు దగ్గరకు దూతలను పంపించి, “వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తెచ్చి వెల చెల్లించి నేను పెండ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు అప్పగించు” అని కబురు చేశాడు.
15ఇష్-బోషెతు మనుష్యులను పంపి ఆమె భర్త లాయిషు కుమారుడైన పల్తీయేలు దగ్గర నుండి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. 16ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు.
17అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి, “గతంలో మీరు దావీదు మీకు రాజుగా ఉండాలని కోరుకున్నారు గదా! 18‘నా సేవకుడైన దావీదు ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విడిపిస్తాను’ అని యెహోవా దావీదుకు ప్రమాణం చేశారు, కాబట్టి ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి” అన్నాడు.
19అలాగే అబ్నేరు బెన్యామీనీయులతో స్వయంగా మాట్లాడాడు. ఆ తర్వాత అతడు హెబ్రోనుకు వెళ్లి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అనుకున్న దాన్నంతా దావీదుకు తెలియజేశాడు. 20అబ్నేరు తనతో కూడా ఇరవైమంది మనుష్యులను వెంటపెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి అతనితో ఉన్నవారందరికి దావీదు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. 21అప్పుడు అబ్నేరు దావీదుతో, “నేను వెంటనే వెళ్లి ఇశ్రాయేలీయులందరిని నా ప్రభువైన రాజు కోసం సమావేశపరచి, వారు మీతో నిబంధన చేసేలా మీరు కోరుకున్న విధంగా మీరు వారిని పరిపాలించేలా చేస్తాను” అని చెప్పాడు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించగా, అతడు సమాధానంతో వెళ్లాడు.
అబ్నేరును హత్యచేసిన యోవాబు
22దాని తర్వాత దావీదు మనుష్యులు, యోవాబు తిరిగివస్తూ తమతో పాటు పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును తీసుకువచ్చారు. కాని వారు వచ్చేసరికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఎందుకంటే దావీదు అతన్ని పంపివేశాడు, అతడు సమాధానంతో వెళ్లిపోయాడు. 23యోవాబు అతనితో ఉన్న సైనికులందరూ వచ్చినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు రాజు దగ్గరకు వచ్చాడని, రాజు అతన్ని పంపివేయగా అతడు సమాధానంతో వెళ్లిపోయాడని యోవాబుకు తెలిసింది.
24కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి, “నీవు ఏమి చేశావు? అబ్నేరు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ఎందుకు వెళ్లనిచ్చావు? ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు! 25నేరు కుమారుడైన అబ్నేరు ఎలాంటివాడో నీకు తెలుసు. నిన్ను మోసం చేయడానికి నీ కదలికలు గమనించడానికి నీవు ఏం చేస్తున్నావో తెలుసుకోవడానికే అతడు వచ్చాడు” అన్నాడు.
26యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లి అబ్నేరును వెనుకకు పిలుచుకురమ్మని దూతలను పంపాడు. వారు వెళ్లి అతన్ని సిరా అనే బావి దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఇదంతా దావీదుకు తెలియదు. 27అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.
28తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే. 29ఈ హత్యచేసిన పాపం యోవాబు మీద అతని కుటుంబమంతటి మీదనే ఉంటుంది. యోవాబు కుటుంబంలో ఎప్పుడూ పుండ్లు పడినవారు, కుష్ఠురోగులు,#3:29 హెబ్రీలో అనే పదం రకరకాల చర్మ వ్యాధులను సూచిస్తుంది. కర్ర సహాయంతో నడిచేవారు, కత్తితో చంపబడినవారు, తిండిలేనివారు ఉంటారు” అని చెప్పాడు.
30(గిబియోను యుద్ధంలో అబ్నేరు తన సోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు అతని సోదరుడైన అబీషై కలిసి పగతీర్చుకున్నారు.)
31దావీదు, “మీ బట్టలు చింపుకుని గోనెబట్ట వేసుకుని అబ్నేరు ముందు నడుస్తూ దుఃఖించండి” అని యోవాబుకు అతనితో ఉన్న ప్రజలందరికి ఆజ్ఞాపించి, రాజైన దావీదు కూడా పాడె వెంట నడిచాడు. 32వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు అబ్నేరు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు, ప్రజలందరూ ఏడ్చారు.
33రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు:
“అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా?
34నీ చేతులకు కట్లులేవు,
కాళ్లకు సంకెళ్ళు లేవు
దుష్టుని ముందు ఒకడు పడినట్లుగా నీవు పడ్డావు.”
ఇది విని ప్రజలందరూ అతని కోసం మరింత గట్టిగా ఏడ్చారు.
35ఇంకా వెలుగుగా ఉన్నప్పుడే ప్రజలందరూ దావీదు దగ్గరకు వచ్చి భోజనం చేయమని బ్రతిమిలాడారు కాని దావీదు ఒట్టు పెట్టుకుని, “సూర్యాస్తమయానికి ముందు నేను ఏమైనా ఆహారం తింటే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.
36ప్రజలందరు అది తెలుసుకుని సంతోషించారు; నిజానికి రాజు చేసిన ప్రతిదీ వారికి సంతోషాన్ని కలిగించింది. 37నేరు కుమారుడైన అబ్నేరు హత్యతో రాజుకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరికి, ఇశ్రాయేలీయులందరికి ఆ రోజు తెలిసింది.
38రాజు తన సేవకులతో, “ఈ రోజు ఇశ్రాయేలు ఒక గొప్ప దళాధిపతిని, ఒక గొప్పవాన్ని కోల్పోయిందని మీకు తెలుసా? 39నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి