2 సమూయేలు 4

4
ఇష్-బోషెతు హత్య
1సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని తెలిసినప్పుడు అతడు భయపడ్డాడు. ఇశ్రాయేలీయులందరు ఆందోళన చెందారు. 2సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము. 3అయితే బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి విదేశీయులుగా నేటి వరకు అక్కడే స్థిరపడి ఉన్నారు.
4(సౌలు కుమారుడైన యోనాతానుకు రెండు కాళ్లు కుంటివైన ఒక కుమారుడు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వార్త వచ్చినప్పుడు వానికి అయిదు సంవత్సరాలు. అతని ఆయా వానిని తీసుకుని పారిపోయే తొందరలో ఉన్నప్పుడు అతడు క్రిందపడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు#4:4 మెరీబ్-బయలు యొక్క మరో పేరు.)
5బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు. 6వారు గోధుమలు తెస్తున్నట్లు నటించి ఇంటి లోపలికి వెళ్లి పడుకున్న ఇష్-బోషెతు కడుపులో పొడిచారు. రేకాబు అతని సోదరుడు బయనా తప్పించుకుని పారిపోయారు.
7అతడు తన మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు వారు ఇంటి లోపలికి వెళ్లారు. వారు అతన్ని పొడిచి చంపిన తర్వాత అతని తల నరికి తమతో తీసుకెళ్లి రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు. 8హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు ఇష్-బోషెతు తల తీసుకువచ్చి రాజుతో, “రాజా! నిన్ను చంపాలనుకున్న నీ శత్రువు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు తల ఇదిగో. ఈ రోజున నా ప్రభువు రాజువైన నీ పక్షంగా సౌలుకు అతని సంతానానికి యెహోవా ప్రతీకారం చేశారు” అన్నాడు.
9దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, అతని సోదరుడు బయనాకు ఇలా జవాబిచ్చాడు: “నిశ్చయంగా, అన్ని కష్టాల నుండి నన్ను విడిపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, 10మంచివార్త తెచ్చాననుకుని ఒకడు నాతో సౌలు చనిపోయాడని చెప్పినప్పుడు నేను అతన్ని పట్టుకుని సిక్లగులో చంపించాను. ఇదే నేను అతనికి ఇచ్చిన బహుమానము. 11అలాంటప్పుడు, దుర్మార్గులైన మీరు ఒక అమాయకున్ని అతని ఇంట్లోనే అతని మంచంపైనే చంపితే, మీరు చేసిన హత్యకు శిక్షించకుండా ఉంటానా? మిమ్మల్ని ఈ లోకం నుండి తుడిచివేయకుండా ఉంటానా?”
12వెంటనే దావీదు తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ ఇద్దరిని చంపేశారు. వారి కాళ్లు చేతులు నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర తగిలించారు. ఇష్-బోషెతు తల తీసుకెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 4: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి