2 సమూయేలు 9
9
దావీదు, మెఫీబోషెతు
1ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
2సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. వారు అతన్ని పిలిపించి దావీదు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అతన్ని, “నీవు సీబావా?” అని అడిగాడు.
అందుకు వాడు, “అవును, రాజా” అన్నాడు.
3అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు.
4“అతడెక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు.
అందుకు సీబా, “అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
5అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు.
6సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు.
దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు.
అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.
7దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
8అప్పుడు మెఫీబోషెతు నమస్కారం చేసి, “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నీవు దయ చూపడానికి నీ సేవకుడనైన నేను ఎంతటివాన్ని?” అన్నాడు.
9అప్పుడు రాజైన దావీదు సౌలు సహాయకుడైన సీబాను పిలిపించి, “సౌలుకు అతని కుటుంబానికి చెందిన సమస్తాన్ని నీ యజమాని మనుమడికి ఇప్పించాను. 10నీవు, నీ కుమారులు నీ పనివారు అతని కోసం ఆ భూమిని సాగుచేసి నీ యాజమాని మనుమడికి కావలసిన ఆహారాన్ని ఆ పంట నుండి తీసుకురావాలి. కాని నీ యాజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. (సీబాకు పదిహేను మంది కుమారులు, ఇరవైమంది పనివారున్నారు.)
11అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు తన సేవకుడనైన నాకు చేయమని ఆజ్ఞాపించిన దాన్నంతా చేస్తాను” అన్నాడు. అప్పటినుండి మెఫీబోషెతు ఒక రాకుమారునిలా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
12మెఫీబోషెతుకు చిన్నకుమారుడు ఉన్నాడు. అతని పేరు మీకా. సీబా ఇంట్లో ఉన్నవారందరు మెఫీబోషెతుకు సేవకులు. 13మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.