అపొస్తలుల కార్యములు 8:26-40

అపొస్తలుల కార్యములు 8:26-40 OTSA

ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు. అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఇతియొపీయుల రాణియైన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఇతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు, అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు. అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు. ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోరు తెరవలేదు. తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.” ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు. వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్లు ఉన్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్లున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఏమైన ఆటంకం ఉందా?” అని అడిగాడు. అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు. అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు. అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడినుండి కైసరయ పట్టణానికి వెళ్లేవరకు అతడు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.