అపొస్తలుల కార్యములు 8:26-40
అపొస్తలుల కార్యములు 8:26-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు. అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఐతియొపీయుల రాణి అయిన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఐతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు, అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు. అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని పిలిచాడు. ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోటిని తెరవలేదు. తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.” ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేక ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. అందుకు ఫిలిప్పు ఆ లేఖనభాగం నుండి మొదలుపెట్టి యేసు మొదలుపెట్టి యేసు గురించి సువార్తను అతనికి బోధించాడు. వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్ళువున్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్ళున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకం ఏమిటి?” అని అడిగాడు. [అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు.] అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్ళలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. వారు నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని సంతోషిస్తూ తన దారిన వెళ్లిపోయాడు. అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడ నుండి కైసరయ పట్టణానికి చేరే వరకు అతడు అన్ని పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.
అపొస్తలుల కార్యములు 8:26-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు. ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు. ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు. అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు. ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే, ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు. బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే, ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు. ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు. అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు. వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు. వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.
అపొస్తలుల కార్యములు 8:26-40 పవిత్ర బైబిల్ (TERV)
ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు. అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా, దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు. “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు! ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?” ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు. ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.
అపొస్తలుల కార్యములు 8:26-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువు దూత–నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను. అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో–నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా– ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు – ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
అపొస్తలుల కార్యములు 8:26-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు. అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఇతియొపీయుల రాణియైన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఇతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు, అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు. అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు. ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోరు తెరవలేదు. తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.” ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు. వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్లు ఉన్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్లున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఏమైన ఆటంకం ఉందా?” అని అడిగాడు. అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు. అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు. అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడినుండి కైసరయ పట్టణానికి వెళ్లేవరకు అతడు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.