ఆమోసు 6
6
సంతృప్తి గలవారికి శ్రమ
1సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ,
సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ,
ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న,
గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!
2మీరు కల్నేకు వెళ్లి చూడండి;
అక్కడినుండి హమాతుకు#6:2 అంటే మహా హమాతు వెళ్లండి,
తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి.
మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా?
వాటి నేల మీకంటే పెద్దది కాదా?
3ఆపద్దినం దూరంగా ఉందనుకుని,
దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.
4మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు,
పరుపులపై ఆనుకుంటారు.
శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను,
శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.
5మీరు దావీదులా సితారా వాయిస్తూ
వాయిద్యాలు మెరుగుపరుస్తారు.
6మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు,
పరిమళ తైలాలు పూసుకుంటారు,
కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.
7కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు;
మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి.
యెహోవా ఇశ్రాయేలు గర్వాన్ని అణచివేయుట
8ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు:
“నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను
అతని కోటలను ద్వేషిస్తున్నాను;
నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో
శత్రువు వశం చేస్తాను.”
9ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా, 10ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు.
11ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా,
పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి
చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.
12గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా?
బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా?
కాని న్యాయాన్ని విషంగా మార్చారు,
నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.
13లో దెబారును#6:13 లో దెబారును అంటే ఏమి లేదు జయించి ఆనందిస్తున్న మీరు,
“మా సొంత బలంతోనే కర్నాయీమును#6:13 కర్నాయీమును అంటే కొమ్ములు; కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది పట్టుకోలేదా?” అంటారు.
14అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు,
“ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను,
అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు
ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆమోసు 6: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.