ద్వితీయో 19
19
ఆశ్రయపురాలు
1మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో ఉన్న జనాన్ని ముందు నాశనం చేసినప్పుడు, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుని, మీరు వారిని తరిమివేసి వారి పట్టణాల్లో వారి ఇళ్ళలో నివసించాలి. 2మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి. 3మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.
4మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు. 5ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు. 6ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు. 7అందువల్లనే మూడు పట్టణాలను మీరు ఎంచుకోవాలని ఆజ్ఞాపించాను.
8మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ సరిహద్దులను విశాలపరచి వారికి వాగ్దానం చేసిన దేశమంతటిని మీకు ఇస్తే, 9నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ చట్టాలన్నిటిని మీరు జాగ్రత్తగా అనుసరించి అనగా మీ దేవుడనైన యెహోవాను ప్రేమిస్తూ, నిత్యం ఆయన పట్ల విధేయత కలిగి మీరు నడుస్తూ, మరో మూడు పట్టణాలు ప్రత్యేకించాల్సి ఉంటుంది. 10మీ దేవుడైన యెహోవా నీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషి రక్తం చిందించబడకుండ, మీరు రక్తపాతానికి పాల్పడకుండ ఉండడానికి ఇలా చేయండి.
11కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి. 12హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి. 13జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
14మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోమని మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు పొందే వారసత్వంలో మీ పూర్వికులు ఏర్పాటుచేసిన మీ పొరుగువారి సరిహద్దు రాయిని తరలించవద్దు.
సాక్ష్యాలు
15ఒకడు చేసిన పాపం విషయంలో గాని అపరాధం విషయంలో గాని దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద నేరం నిర్ధారణ చేయాలి.
16ఒకవేళ కపట బుద్ధి గలవాడు ఎవరిమీదైనా నేరారోపణ చేయడానికే పూనుకుంటే, 17ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి. 18న్యాయాధిపతులు ఆ వాదనను బాగా విచారణ చేయాలి, సాక్షి అబద్ధికుడని రుజువైతే, తోటి ఇశ్రాయేలీయులపై అబద్ధ సాక్ష్యమును పలికిన ఎడల, 19వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. 20ప్రజలు ఇది చూసి భయపడి అలాంటి దుర్మార్గపు పనులు మీ దేశంలో మళ్ళీ చేయరు. 21జాలి పడకూడదు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు. ఇదే నియమం పాటించి తీరాలి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయో 19: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.