ఎస్తేరు 1
1
వష్తి రాణి బహిష్కరణ
1ఇండియా నుండి కూషు దేశం#1:1 అంటే, నైలు ఉపరితల ప్రాంతం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి. 2ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు. 3అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు.
4నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు. 5ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు. 6ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి. 7అతిథులకు బంగారు పాన పాత్రల్లో ద్రాక్షరసం వడ్డించారు, ఒక్కో పాత్ర ఒక్కో దానికి భిన్నమైనది, రాజు ధారాళ స్వభావం గలవాడు కాబట్టి ద్రాక్షరసం సమృద్ధిగా ఉంది. 8రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు.
9వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.
10-11ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. 12అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.
13చట్టం, న్యాయం విషయాల్లో రాజు నిపుణులను సంప్రదించడం ఆచారం కాబట్టి, కాలాలను అర్థం చేసుకునే జ్ఞానులతో, 14కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా మెముకాను అనే ఏడుగురు రాజుకు సన్నిహితులు. రాజు దగ్గర ప్రత్యేక హోదాలో రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పర్షియా, మెదీయకు చెందిన ఈ ఏడుగురు సంస్థానాధిపతులతో రాజు మాట్లాడాడు.
15“చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”
16అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది. 17రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు. 18రాణి ప్రవర్తన గురించి విన్న పర్షియా మెదీయ సంస్థానాధిపతుల భార్యలు ఈ రోజే రాణి అన్నట్లే రాజ అధిపతులందరితో అంటారు. దీనివలన అంతులేని తిరస్కారం కోపం కలుగుతుంది.
19“కాబట్టి రాజుకు ఇష్టమైతే, రాజైన అహష్వేరోషు ముందుకు వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని రాజాజ్ఞ జారీ చేయండి. అది రద్దు కాకుండా ఉండడానికి దానిని పర్షియా మెదీయ శాసన గ్రంథాల్లో వ్రాయాలి. అంతేకాక, ఆమెకంటే యోగ్యురాలికి రాణి స్థానాన్ని ఇవ్వాలి. 20అప్పుడు రాజు నిర్ణయాన్ని అతని మహారాజ్యమంతా ప్రకటిస్తే, అల్పుల నుండి ఘనుల వరకు స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు” అన్నాడు.
21ఈ సలహా రాజుకు, అతని సంస్థానాధిపతులకు నచ్చింది, కాబట్టి మెముకాను ప్రతిపాదించినట్లు రాజు చేశాడు. 22అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 1: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.