ఎస్తేరు 6

6
మొర్దెకై ఘనపరచబడుట
1ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు; కాబట్టి తన పాలన గురించి ఉన్న రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి, చదివించుకున్నాడు. 2అందులో రాజభవన ద్వారపాలకులైన బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజ్యాధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నిన సంగతిని మొర్దెకై తెలియజేసినట్లు వ్రాయబడి ఉంది.
3రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు.
అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు.
4రాజు, “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. అప్పుడే హామాను, తాను సిద్ధపరచిన ఉరికంబం మీద మొర్దెకైను ఉరితీయడం గురించి రాజుతో మాట్లాడడానికి బయట ఆవరణంలోకి ప్రవేశించాడు.
5రాజు సేవకులు, “హామాను ఆవరణంలో నిలబడ్డాడు” అని చెప్పారు.
వెంటనే, “అతన్ని లోనికి తీసుకురండి” అని రాజు ఆదేశించాడు.
6హామాను లోపలికి వచ్చినప్పుడు, “రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు.
హామాను, “నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?” అని తనలో తాను అనుకున్నాడు. 7కాబట్టి హామాను రాజుతో, “రాజు సన్మానించాలని అనుకునే వ్యక్తి కోసం, 8రాజు ధరించుకునే రాజవస్ర్తాలను, రాజు స్వారీ చేసే గుర్రాన్ని, రాజు తలమీద పెట్టుకునే రాజకిరీటాన్ని తీసుకురావాలి. 9తర్వాత ఆ రాజవస్త్రాన్ని ఆ గుర్రాన్ని రాజు యొక్క అత్యంత ఘనులైన ఓ అధిపతికి అప్పగించాలి. రాజు సన్మానించాలని అనుకున్న ఆ వ్యక్తికి ఆ రాజ వస్త్రం వేయించి ఆ గుర్రం మీద నగర వీధుల్లో త్రిప్పుతూ, ‘రాజు ఒక వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఆ వ్యక్తికి ఇలా చేయబడుతుంది!’ అని అంటూ ఆ వ్యక్తి ఎదుట చాటాలి” అని అన్నాడు.
10అందుకు రాజు, “త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు” అని హామానుకు ఆజ్ఞాపించాడు.
11కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.
12తర్వాత మొర్దెకై రాజ ద్వారం దగ్గరకు తిరిగి వచ్చాడు. కాని హామాను దుఃఖంతో తల కప్పుకుని వేగంగా ఇంటికి వెళ్లి, 13హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు.
అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.” 14వారింకా మాట్లాడుకుంటున్నప్పుడు, రాజు యొక్క నపుంసకులు వచ్చి, ఎస్తేరు రాణి చేయించిన విందుకు రమ్మని హామానును తొందరపెట్టారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎస్తేరు 6: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి