ఎస్తేరు 9
9
1అదారు అనే పన్నెండవ నెల, పదమూడవ రోజున, రాజు శాసనం అమల్లోకి వచ్చింది. ఈ రోజున యూదుల శత్రువులు వారిని జయించగలమని నిరీక్షించారు కాని దానికి భిన్నంగా జరిగింది, యూదులు తమను ద్వేషించేవారి మీద పైచేయి కలిగి ఉన్నారు. 2యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు. 3సంస్థానాధిపతులు, సామంత రాజులు, ప్రభుత్వ అధికారులు, రాజ్య అధికారులు, అందరు మొర్దెకై అంటే భయంతో యూదులకు సహాయపడ్డారు. 4మొర్దెకై రాజభవనంలో ప్రముఖుడయ్యాడు; అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది, అతడు అంతకంతకు శక్తిగలవాడయ్యాడు.
5యూదులు తమ శత్రువులందరి మీద ఖడ్గంతో దాడి చేసి చంపి నాశనం చేసి, తమను ద్వేషించిన వారికి తమకు ఇష్టమైనట్టుగా చేశారు. 6షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు. 7-9వారు పర్షందాతా దల్ఫోను అస్పాతా పోరాతా అదల్యా అదీదాతా పర్మష్తా అరీసై అరీదై వైజాతాలను కూడా చంపారు. 10ఈ పదిమంది యూదుల శత్రువైన హమ్మెదాతా కుమారుడైన హామాను కుమారులు. అయితే వారు వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.
11షూషను కోటలో చంపబడినవారి సంఖ్య ఆ రోజే రాజుకు చెప్పారు. 12రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.
13ఎస్తేరు జవాబిస్తూ, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, ఈ శాసనం రేపు కూడా షూషనులో ఉన్న యూదులు చేసేలా అనుమతి ఇచ్చి హామాను పదిమంది కుమారులు ఉరికంబం మీద వ్రేలాడదీయబడేలా చేయండి” అని చెప్పింది.
14కాబట్టి అలా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. షూషనులో ఆజ్ఞ జారీ చేయబడింది, వారు హామాను యొక్క పదిమంది కుమారులను ఉరితీశారు. 15అదారు నెల పద్నాలుగవ రోజున యూదులు షూషనులో సమకూడి, షూషనులో మూడువందలమంది మనుష్యులను చంపారు. కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.
16అంతలో, రాజు సంస్థానాలలో ఉన్న మిగితా యూదులు కూడా తమను తాము కాపాడుకోడానికి సమకూడి శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు.వారు డెబ్బై అయిదువేల మందిని చంపారు కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు. 17ఇది అదారు నెల పదమూడవ రోజున జరిగింది. పద్నాలుగవ రోజు వారు విశ్రమించి ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.
18అయితే షూషనులో ఉన్న యూదులు పదమూడు, పద్నాలుగవ రోజులు కూడుకుని, పదిహేనవ రోజున విశ్రమించి, ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.
19గ్రామాల్లో నివసించే పల్లెవాసులైన యూదులు అదారు నెల పద్నాలుగవ రోజున విందు చేసుకుని ఆనందించే రోజుగా జరుపుకుంటారు, ఆ రోజు ఒకరికి ఒకరు బహుమానాలు ఇచ్చుకుంటారు.
పూరీము స్థాపించబడుట
20మొర్దెకై ఈ సంగతులన్ని నమోదు చేసి, రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికి దగ్గరలో దూరంలో నివసిస్తున్న యూదులందరికి ఉత్తరాలు పంపాడు. 21-22యూదులు తమ శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు, తమ బాధ సంతోషంగా మారింది, తమ దుఃఖం ఆనందించే రోజుగా మారింది కాబట్టి ప్రతి ఏట అదారు నెల పద్నాలుగు, పదిహేను రోజుల్లో వార్షిక పండగ జరుపుకోవాలని అతడు వ్రాశాడు. ఆ రోజులు విందు చేసుకుని ఆనందించే రోజులుగా, ఒకరికి ఒకరు ఆహార బహుమానాలు ఇచ్చుకునే రోజులుగా, పేదలకు బహుమానాలు ఇచ్చే రోజులుగా జరుపుకోవాలాని అతడు వారికి వ్రాశాడు.
23కాబట్టి యూదులు మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారం తాము ప్రారంభించిన ఉత్సవం కొనసాగిస్తామని ఒప్పుకున్నారు. 24యూదులందరికి శత్రువైన అగగీయుడు హమ్మెదాతా కుమారుడైన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్రపన్ని, వారిని నాశనం చేసి, నిర్మూలించడానికి పూరు (అనగా, చీట్లు) వేశాడు. 25అయితే ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు,#9:25 లేదా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చినప్పుడు అతడు హామాను యూదులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేలా చేసి, అతన్ని అతని కుమారులను ఉరికంబాలకు వ్రేలాడదీయాలని రాజు వ్రాతపూర్వక ఆదేశాలు జారీ చేశాడు. 26(అందువల్ల ఈ రోజులకు పూరు అనే పదం నుండి వచ్చిన పూరీము అని పేరు వచ్చింది.) ఈ ఉత్తరంలో వ్రాయబడిన ప్రతి విషయం బట్టి, వారు చూసిన, తమకు జరిగిన వాటిని బట్టి, వారు ఏమి చూశారో, వారికి ఏమి జరిగిందో దానిని బట్టి, 27యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 28తరతరాల వరకు ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కుటుంబం ద్వారా వచ్చే ప్రతి తరం వారు ఈ రోజులను జ్ఞాపకం చేసుకుని ఉత్సవంగా జరుపుకోవాలి. యూదులు ఈ పూరీము రోజులు పాటించకుండా ఉండకూడదు. ఈ రోజుల జ్ఞాపకం వారి వారసులు ఎన్నడూ మరచిపోకూడదు.
29కాబట్టి అబీహయిలు కుమార్తెయైన ఎస్తేరు రాణి, యూదుడైన మొర్దెకైతో కలిసి పూరీము గురించి ఈ రెండవ లేఖను ధృవీకరించడానికి పూర్తి అధికారంతో వ్రాశారు. 30అహష్వేరోషు సామ్రాజ్యంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరికి క్షేమం, నమ్మకం కలిగించే మాటలతో కూడిన ఉత్తరాన్ని మొర్దెకై పంపాడు. 31యూదుడైన మొర్దెకై ఎస్తేరు రాణి శాసించిన విధంగా పూరీము దినాలను వాటి సమయాల్లో జరిగేలా నిర్ధారించినట్లే వారు తమ కోసం తమ వారసుల కోసం ఉపవాస విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు. 32ఎస్తేరు శాసనం వలన పూరీము గురించిన ఈ నిబంధనలు నిర్ధారించబడి చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడ్డాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.