నిర్గమ 31
31
బెసలేలు అహోలీయాబు
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని, 3నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను. 4అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు. 5ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు. 6అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను.
“నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి నైపుణ్యం కలిగిన పనివారందరికి నేను సామర్థ్యాన్ని ఇచ్చాను:
7“ప్రత్యక్ష గుడారం,
నిబంధన మందసం, దాని మీద ఉండే ప్రాయశ్చిత్త మూత,
గుడారంలోని ఇతర ఉపకరణాలు
8బల్ల, దానిమీది ఉపకరణాలు,
స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం, దాని ఉపకరణాలు,
ధూపవేదిక,
9దహనబలిపీఠం దాని పాత్రలు,
ఇత్తడి గంగాళం దాని ఇత్తడి పీట;
10అంతేకాక యాజక సేవ చేసేటప్పుడు ధరించడానికి నేసిన వస్త్రాలు,
యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు,
అలాగే అతని కుమారులకు వస్త్రాలు వారు యాజకులుగా పరిచర్య చేస్తున్నప్పుడు వేసుకోడానికి,
11పరిశుద్ధస్థలం కోసం అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపము.
“వారు వాటన్నిటిని నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయాలి.”
సబ్బాతు
12ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నారు, 13“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.
14“ ‘మీరు సబ్బాతును ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పరిశుద్ధమైనది. దానిని అపవిత్రం చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి; ఆ రోజు ఏ పనైనా చేస్తే చేసినవారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి. 15ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినం, యెహోవాకు పరిశుద్ధమైనది. సబ్బాతు దినాన ఎవరైనా ఏ పనైనా చేస్తే చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. 16రాబోయే తరాలకు నిత్యమైన ఒడంబడికగా ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి. 17ఇది నాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎప్పటికీ ఒక గుర్తులా ఉంటుంది, ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను భూమిని చేశారు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకుని సేదదీరారు.’ ”
18యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత, ఆయన ఒడంబడిక పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతిపలకలను అతనికి ఇచ్చారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమ 31: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.