యెహెజ్కేలు 36
36
ఇశ్రాయేలు పర్వతాలకు నిరీక్షణ
1“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి. 2ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’ 3కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు. 4కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ, 5ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’ 6కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు దేశాల మధ్య అవమానించబడ్డారు, కాబట్టి నేను నా రోషంలో ఉగ్రతలో మాట్లాడుతున్నాను. 7కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.
8“ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి. 9నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు. 10మీమీద మనుష్యజాతిని అంటే ఇశ్రాయేలీయులందరు నివసించేలా చేస్తాను. నా పట్టణాల్లో మళ్ళీ నివాసులు ఉంటారు, శిథిలాలు మళ్ళీ కట్టబడతాయి. 11మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 12నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.
13“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీవు మనుష్యులను చంపుతూ, నీ దేశంలో పిల్లలు లేకుండా చేస్తున్నావు” అని కొందరు నీ గురించి చెప్పుకుంటున్నారు. 14కాబట్టి నీవు ఇకపై మనుష్యులను చంపవు, నీ దేశాన్ని పిల్లలు లేనిదిగా చేయవు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 15ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
ఇశ్రాయేలును పునరుద్ధరిస్తానని హామీ
16మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 17“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తున్నప్పుడు, వారు తమ ప్రవర్తనతో తమ చేష్టలతో దానిని అపవిత్రం చేశారు. నా దృష్టికి వారి ప్రవర్తన నెలసరిలో ఉన్న స్త్రీ అపవిత్రతలా ఉంది. 18కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను. 19నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టాను, వారు వివిధ దేశాలకు చెదిరిపోయారు; వారి ప్రవర్తన, వారి చేష్టలకు తగినట్టుగా నేను వారికి తీర్పు తీర్చాను. 20వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు. 21నా పరిశుద్ధ నామం గురించి నాకు చింత ఉంది, దానిని ఇశ్రాయేలీయులు తాము వెళ్లిన దేశాల్లో అపవిత్రం చేశారు.
22“కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు ప్రజలారా, నేను చేయబోయేది మీ కోసం కాదు, ఇతర ప్రజల్లో మీ వలన అవమానానికి గురియైన నా పరిశుద్ధ నామం కోసమే చేస్తాను. 23మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
24“ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను. 25నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. 26నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చి, మీలో నూతనమైన ఆత్మను ఉంచుతాను. మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను. 27నా ఆత్మను మీలో ఉంచి, నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మిమ్మల్ని చేస్తాను. 28అప్పుడు మీ పూర్వికులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. 29మీ అపవిత్రతలన్నిటి నుండి మిమ్మల్ని కాపాడతాను. మీ మీదికి కరువు తీసుకురాకుండా మీకు సమృద్ధిగా ధాన్యం పండేలా చేస్తాను. 30చెట్ల ఫలాలను, పొలాల పంటను వృద్ధి చేస్తాను, అప్పుడు కరువు కారణంగా ఇతర ప్రజల ముందు మీకు అవమానం కలుగదు. 31అప్పుడు మీరు మీ చెడు ప్రవర్తనను, చేసిన చెడ్డపనులను జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన పాపాలు అసహ్యమైన పనులను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. 32ఇదంతా నేను మీ కోసం చేయడం లేదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలీయులారా! మీ ప్రవర్తనకు సిగ్గుపడండి, అవమానంగా భావించండి.
33“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మిమ్మల్ని మీ పాపాలన్నిటి నుండి శుద్ధి చేసే రోజున మీరు తిరిగి మీ పట్టణాల్లో నివసించేలా చేస్తాను; శిథిలమైన పట్టణాలు తిరిగి కట్టబడతాయి. 34ఆ దారిలో వెళ్లే వారందరి దృష్టికి ఈ పాడుబడి నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ భూమి సేద్యం చేయబడుతుంది. 35వ్యర్థంగా ఉండిన ఈ భూమి ఏదెను తోటలా మారింది; శిథిలమై పాడుబడి నిర్మానుష్యంగా ఉన్న పట్టణాలు ఇప్పుడు కోటలతో జనసంచారంతో సందడిగా ఉన్నాయని వారంటారు. 36అప్పుడు యెహోవానైన నేను శిథిలమైన వాటిని మళ్ళీ కడతానని, పాడైన స్థలాల్లో చెట్లు నాటుతానని మీ చుట్టూ మిగిలి ఉన్న దేశాలు తెలుసుకుంటాయి. యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను చేస్తాను.’
37“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలు ప్రజలు నన్ను వేడుకునేలా చేస్తాను. గొర్రెలు విస్తరించినట్లు నేను వారు విస్తరించేలా చేస్తాను. 38నియమించబడిన పండుగల్లో యెరూషలేములో అర్పించబడే గొర్రె మందల్లా వారి సంఖ్యను అభివృద్ధి చేస్తాను. అప్పుడు శిథిలమైన పట్టణాలు మనుష్యుల గుంపులతో నిండిపోతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 36: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.