యెహెజ్కేలు 38
38
దేశాల మీద యెహోవా గొప్ప విజయం
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, మాగోగు దేశానికి చెందిన గోగు వైపు అనగా మెషెకుకు తుబాలుకు రోషుకు అధిపతియైన వానివైపు నీ ముఖాన్ని త్రిప్పి, అతనికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పుమని ఆజ్ఞాపించింది: 3ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన#38:3 లేదా రోషుకు అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. 4నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను. 5పర్షియా, కూషు, పూతు వారందరు డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి వారితో పాటు వస్తారు. 6అలాగే గోమెరు అతని సైన్యం, ఉత్తరాన దూరంగా ఉన్న తోగర్మా అతని సైన్యం, ఇంకా అనేక జాతులవారు నీతో వస్తారు.
7“ ‘సిద్ధంగా ఉండు; నీవు నీతో పాటు చేరిన సమూహమంతటితో కలిసి సిద్ధంగా ఉండు, నీవే వారికి నాయకునిగా ఉండు. 8చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు. 9అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు.
10“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని, 11దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను. 12వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.” 13షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి#38:13 లేదా కొదమసింహాలు వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’
14“మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా? 15ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు. 16దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.
17“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: పూర్వకాలంలో నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడింది నీ గురించే. నేను నిన్ను వారికి వ్యతిరేకంగా తీసుకువస్తానని అనేక సంవత్సరాలుగా వారు ప్రవచించారు. 18ఆ రోజున గోగు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపం తీవ్రంగా ఉంటుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 19నేను రోషంతో, కోపోద్రేకంతో ఏమని ప్రకటించానంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన భూకంపం వస్తుంది. 20అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది. 21నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 22తెగులుతో రక్తపాతంతో అతని మీద తీర్పు తీరుస్తాను; అతనిపై అతని సైన్యం మీద అతనితో పాటు ఉన్న అనేక దేశాలపై నేను కుండపోత వర్షాన్ని, వడగండ్లను అగ్నిగంధకాలను కురిపిస్తాను. 23నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 38: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.