యెహెజ్కేలు 42
42
యాజకుల కోసం గదులు
1అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు. 2ఉత్తరం వైపు తలుపు ఉన్న ఆ భవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు.#42:2 అంటే, సుమారు 53 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు 3లోపలి ఆవరణం నుండి ఇరవై మూరల#42:3 అంటే, సుమారు 11 మీటర్లు భాగంలో బయటి ఆవరణం కాలిబాట ఎదురుగా ఉన్న భాగంలో, వసారా మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. 4ఆ గదుల ముందు పది మూరల వెడల్పు, వంద మూరల పొడవు ఉన్న లోపలి మార్గం ఉంది. వాటి తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి. 5ఆ భవనంలోని క్రింది అలాగే మధ్య అంతస్తులలో ఉన్న గదుల కన్నా పై అంతస్తులో వసారాలు ఎక్కువ స్థలం ఆక్రమించడం వలన పై గదులు ఇరుకుగా ఉన్నాయి. 6పై అంతస్తులో ఉన్న గదులకు ఆవరణంలో ఉన్నట్లుగా స్తంభాలు లేవు; కాబట్టి అవి క్రింది, మధ్య అంతస్తుల కంటే చిన్నవిగా ఉన్నాయి. 7గదులకు, బయటి ఆవరణానికి సమాంతరంగా బయటి గోడ ఉంది; అది యాభై మూరల వరకు గదుల ముందు విస్తరించి ఉంది. 8బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది. 9బయటి ఆవరణంలో నుండి దిగువ గదుల్లోకి ప్రవేశించేలా దిగువ గదులకు తూర్పు వైపున ద్వారం ఉంది.
10బయటి ఆవరణ గోడ పొడవున దక్షిణం వైపున,#42:10 కొ.ప్రా.ప్ర.లలో తూర్పు వైపున ఆలయ ప్రాంగణానికి ఆనుకుని, బయటి గోడకు ఎదురుగా గదులు ఉన్నాయి, 11వాటికి ముందు ఒక మార్గం ఉంది. అవి ఉత్తరాన ఉన్న గదుల్లా ఉన్నాయి; అవి ఒకే విధమైన బయటకు వెళ్లే ద్వారాలు, కొలతలతో ఒకే పొడవు, వెడల్పు కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వారాల మాదిరిగానే, 12దక్షిణాన ఉన్న గదుల ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న గోడకు ఎదురుగా ఉన్న ఆవరణంలోకి వెళ్లే దారి మొదట్లో ఆ గదుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది.
13అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది. 14యాజకులు పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత, వారు పరిచర్య చేసే వస్త్రాలను విప్పివేసే వరకు వారు బయటి ఆవరణంలోనికి వెళ్లకూడదు, ఎందుకంటే ఇవి పరిశుద్ధమైనవి. ప్రజలు ఉండే స్థలానికి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు ధరించాలి.”
15అతడు లోపలి మందిరాన్ని కొలవడం పూర్తి చేసిన తర్వాత అతడు నన్ను తూర్పు ద్వారం గుండా తీసుకెళ్లి చుట్టూ ఉన్న స్థలాన్ని కొలిచాడు. 16తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు#42:16 అంటే సుమారు 265 మీటర్లు; 17, 18, 19 వచనాల్లో కూడా ఉంది. 17అలాగే ఉత్తరం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 18దక్షిణం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 19అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 20అతడు ఆ స్థలాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పరిశుద్ధ స్థలాన్ని సాధారణ స్థలాన్ని వేరు చేయడానికి దాని చుట్టూ అయిదువందల మూరల పొడవు అయిదువందల మూరల వెడల్పు గల ఒక గోడ ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 42: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.