యెహెజ్కేలు 6
6
ఇశ్రాయేలు పర్వతాలకు వినాశనం
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల వైపు తిరిగి, వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ, 3ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, పర్వతాలకు, కొండలకు, కనుమలకు, లోయలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ క్షేత్రాలను నాశనం చేస్తాను. 4మీ బలిపీఠాలు కూల్చివేయబడతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి; మీ విగ్రహాల ముందు నేను నీ ప్రజలను చంపుతాను. 5ఇశ్రాయేలీయుల శవాలను వారి విగ్రహాల ముందు పడవేస్తాను, మీ బలిపీఠాలు చుట్టూ మీ ఎముకలు వెదజల్లుతాను. 6మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి. 7మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
8“ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు. 9అప్పుడు తప్పించుకుని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దూరంగా ఉన్న వారి వ్యభిచార హృదయాలను బట్టి నేను ఎలా దుఃఖించానో, వారి విగ్రహాల పట్ల వారి కళ్లల్లో కనిపించిన మోహాన్ని బట్టి నేను ఎలా బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన చెడును బట్టి వారి అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి తమను తాము అసహ్యించుకుంటారు. 10అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు; వారిపైకి కీడు రప్పిస్తానని నేను ఊరకనే బెదిరించలేదు.
11“ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు. 12దూరాన ఉన్నవారు తెగులు వచ్చి చస్తారు. దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, ఎవరైనా మిగిలినా, విడిచిపెట్టబడినా, వారు కరువుతో చస్తారు. నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. 13తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. 14నేను వారికి వ్యతిరేకంగా నా చేయి చాపి వారెక్కడ నివసించినా ఆ దేశాన్ని ఎడారి నుండి రిబ్లా#6:14 కొ.ప్ర.లలో దిబ్లా వరకు నిర్జనమైన వ్యర్థంగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 6: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.