ఎజ్రా 7
7
ఎజ్రా యెరూషలేముకు వచ్చుట
1ఈ విషయాలన్ని జరిగిన తర్వాత, పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న కాలంలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు, 2అతడు షల్లూము కుమారుడు, అతడు సాదోకు కుమారుడు, అతడు అహీటూబు కుమారుడు, 3అతడు అమర్యా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు మెరాయోతు కుమారుడు, 4అతడు జెరహ్యా కుమారుడు, అతడు ఉజ్జీ కుమారుడు, అతడు బుక్కీ కుమారుడు, 5అతడు అబీషూవ కుమారుడు, అతడు ఫీనెహాసు కుమారుడు, అతడు ఎలియాజరు కుమారుడు, అతడు ముఖ్య యాజకుడైన అహరోను కుమారుడు. 6ఈ ఎజ్రా బబులోను నుండి తిరిగి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి. తన దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగిన వాటన్నిటిని రాజు అతనికి ఇచ్చాడు. 7రాజైన అర్తహషస్త పరిపాలనలో ఏడవ సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, వారితో పాటు యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు యెరూషలేముకు వచ్చారు.
8రాజు పరిపాలనలోని ఏడవ సంవత్సరం అయిదవ నెలలో, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు. 9తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు. 10యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం చేయాలని, ఇశ్రాయేలీయులకు దాని శాసనాలను, న్యాయవిధులను నేర్పించాలని ఎజ్రా నిశ్చయించుకున్నాడు.
ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఉత్తరం
11యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలు ఆజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర శాస్త్రి, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరం నకలు ఇది:
12రాజులకు రాజైన అర్తహషస్త,
యాజకుడును ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు వ్రాయునది,
శుభములు.
13నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను. 14నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు. 15అంతేకాక, యెరూషలేములో నివాసం ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు అతని సలహాదారులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వెండి బంగారాలను నీతో తీసుకెళ్లాలి. 16వాటితో పాటు బబులోను ప్రాంతమంతటిలో నీకు లభించిన వెండి బంగారాలను, యెరూషలేములో ఉన్న తమ దేవుని ఆలయానికి ప్రజలు, యాజకులు ఇచ్చిన కానుకలను నీవు తీసుకెళ్లాలి. 17ఆ డబ్బుతో నీవు బలి అర్పించడానికి కావలసిన ఎడ్లు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, వాటి భోజనార్పణలు, పానార్పణలతో పాటు కొని, యెరూషలేములోని నీ దేవుని ఆలయ బలిపీఠం మీద వాటిని అర్పించాలి.
18మిగిలిన వెండి బంగారాలను నీ దేవుని చిత్తప్రకారం నీకు, నీ తోటి ఇశ్రాయేలీయులకు సమ్మతమైన విధంగా వాడండి. 19నీ దేవుని మందిరంలో ఆరాధన కోసం నీకు అప్పగించిన అన్ని వస్తువులను యెరూషలేములోని దేవుని సన్నిధిలో అందించాలి. 20నీ దేవుని ఆలయానికి ఇంకా అవసరమైనవి ఏమైనా నీవు కావాలంటే, రాజ ఖజానా నుండి అవి నీకు అందించబడతాయి.
21రాజునైన అర్తహషస్త అనే నేను, యూఫ్రటీసు నది అవతలి కోశాధికారులకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, పరలోక దేవుని ధర్మశాస్త్ర బోధకుడు, యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే, దానిని శ్రద్ధతో మీరు అందించాలి. 22వంద తలాంతుల#7:22 అంటే, సుమారు 3 3/4 టన్నులు వెండి, వెయ్యి తూముల#7:22 అంటే, సుమారు 18 మెట్రిక్ టన్నులు వరకు గోధుమలు, వంద బాతుల#7:22 అంటే, సుమారు 2,200 లీటర్లు ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ#7:22 అంటే, సుమారు 2,200 లీటర్లు నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి. 23పరలోక దేవుడు నిర్దేశించిన ప్రకారం పరలోక దేవుని మందిరం కోసం శ్రద్ధగా చేయాలి. రాజు అతని కుమారుల సామ్రాజ్యం మీదికి దేవుని కోపం ఎందుకు రావాలి? 24అంతేకాక, యాజకులలో, లేవీయులలో, సంగీతకారులలో, ద్వారపాలకుల్లో, దేవాలయ సేవకులలో లేదా ఇతర పనివారిలో ఎవరి మీద హోదా పన్ను గాని, కప్పం గాని, సుంకం గాని, విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
25ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి. 26నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి.
27యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయానికి ఈ విధంగా ఘనత చేకూర్చేందుకు రాజు హృదయాన్ని కదిలించిన మన పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతి! 28రాజుకు, అతని సహాయకులకు రాజు యొక్క శక్తివంతులైన నాయకులకు నా మీద దయ కలిగేలా ఆయన తన దయ నాపై చూపించారు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి, నేను ధైర్యం చేసి నాతో రావడానికి ఇశ్రాయేలీయుల నాయకులను సమకూర్చాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 7: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.