ఆది 44
44
సంచిలో వెండి గిన్నె
1యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు. 2తర్వాత కనిష్ఠుని గోనెసంచిలో మాత్రం ధాన్యం, రూకలుగా తెచ్చిన వెండితో పాటు నా వెండి గిన్నెను పెట్టు” అని సూచించాడు. అతడు యోసేపు చెప్పినట్టు చేశాడు.
3తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు వారి గాడిదలతో పాటు పంపబడ్డారు. 4పట్టణం నుండి వారింకా దూరం వెళ్లకముందే, యోసేపు గృహనిర్వాహకునితో, “వెంటనే ఆ మనుష్యుల వెంట వెళ్లు, వారిని పట్టుకున్నప్పుడు, ‘మేలుకు ప్రతిగా కీడును ఎందుకు చేశారు? 5ఇది మా యజమాని త్రాగడానికి, భవిష్యవాణి కోసం ఉపయోగించే గిన్నె కాదా? మీరు చేసింది చెడ్డ పని’ అని వారితో చెప్పు” అన్నాడు.
6గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు. 7అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక! 8మా గోనెసంచులలో దొరికిన వెండి తిరిగి కనాను దేశం నుండి తెచ్చాము. కాబట్టి వెండి లేదా బంగారం ఎందుకు నీ యజమాని ఇంటి నుండి దొంగిలిస్తాము? 9ఒకవేళ మీ దాసులలో ఎవరి దగ్గరైనా దొరికితే, వాడు చస్తాడు; మిగిలినవారం మా ప్రభువా బానిసలమవుతాం” అని అన్నారు.
10అప్పుడు అతడు, “సరే మీరన్నట్టే కానివ్వండి; ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడు నాకు బానిస అవుతాడు, మిగితా వారు నిర్దోషులవుతారు” అని అన్నాడు.
11వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. 12అప్పుడు గృహనిర్వాహకుడు పెద్దవాడి నుండి ప్రారంభించి చిన్నవాడి వరకు సోదా చేశాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెసంచిలో దొరికింది. 13ఇది చూసి వారు తమ బట్టలు చింపుకున్నారు. వారందరు తమ గాడిదల మీద తన గోనెసంచులు ఎత్తుకుని, తిరిగి పట్టణానికి వెళ్లారు.
14యూదా అతని సోదరులు వచ్చినప్పుడు యోసేపు ఇంట్లోనే ఉన్నాడు, వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 15యోసేపు వారితో, “మీరు చేసిన ఈ పని ఏంటి? నా లాంటి మనుష్యుని భవిష్యవాణి ద్వారా విషయాలు తెలుసుకుంటాడని మీకు తెలియదా?” అని అన్నాడు.
16యూదా జవాబిస్తూ, “మా ప్రభువా, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలం? మీ దాసుల అపరాధాన్ని దేవుడు బయటపెట్టారు. మేమిప్పుడు మా ప్రభువు బానిసలం; మాలో ఎవరి సంచిలో గిన్నె దొరుకుతుందో వాడు కూడా మా ప్రభువుకు దాసుడవుతాడు” అన్నాడు.
17అయితే యోసేపు, “అలా చేయడం నాకు దూరం అవును గాక! ఎవరి దగ్గర గిన్నె దొరికిందో అతడు మాత్రమే నా బానిస. మిగిలిన మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్లండి” అన్నాడు.
18అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి. 19నా ప్రభువు తమ దాసులను, ‘మీకు తండ్రి గాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని అడిగారు. 20దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము.
21“అప్పుడు మీరు మీ దాసులతో, ‘అతన్ని నేను చూడాలి, నా దగ్గరకు తీసుకురండి’ అని అన్నారు. 22అందుకు మేము నా ప్రభువుతో, ‘అతడు తండ్రిని విడిచి ఉండలేడు; ఒకవేళ అతడు విడిచిపెట్టి వస్తే, అతని తండ్రి చనిపోతాడు’ అని చెప్పాము. 23కాని మీరు మీ దాసులతో, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే తప్ప మీరు నాకు కనబడవద్దు’ అని అన్నారు. 24మేము మా తండ్రి దగ్గరకు వెళ్లి మా ప్రభువు చెప్పిందంతా చెప్పాము.
25“మా తండ్రి, ‘ఇంకొంచెం ఆహారం కొనడానికి మళ్ళీ వెళ్లండి’ అన్నాడు. 26అందుకు మేము అతనితో, ‘మేము వెళ్లలేము. మా చిన్న తమ్ముడు మాతో వెళ్తేనే మేము వెళ్తాము. మా చిన్న తమ్ముడు మాతో ఉంటేనే తప్ప మేము వెళ్లి ఆయన ముఖం చూడలేం’ అని చెప్పాము.
27“మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు. 28వారిలో ఒకడు వెళ్లి తిరిగి రాలేదు. నిస్సందేహంగా అతన్ని ఏదో అడవి జంతువు చంపి ముక్కలు చేసి ఉంటుంది. అప్పటినుండి అతన్ని నేను చూడలేదు. 29మీరు నా దగ్గర నుండి వీన్ని కూడా తీసుకెళ్తే, వీనికి ఏదైన హాని సంభవిస్తే, దుఃఖిస్తూ ఉన్న, తల నెరసిన ఈ వ్యక్తిని సమాధికి పంపిన వారవుతారు’ అన్నాడు.
30“కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి, 31మాతో చిన్నవాడు లేకపోవడం చూసి, అతడు చనిపోతాడు. మీ దాసులమైన మేము తల నెరిసిన మా తండ్రిని దుఃఖంలోనే సమాధికి తీసుకెళ్లిన వారమవుతాము. 32మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను.
33“కాబట్టి ఇప్పుడు, ఈ చిన్నవానికి బదులు నా ప్రభువు యొక్క దాసుని మీ దగ్గర బానిసగా ఉండనివ్వండి, ఈ చిన్నవాన్ని మాత్రం తన సోదరులతో తిరిగి వెళ్లనివ్వండి. 34చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆది 44: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.