హోషేయ 2
2
1“మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.
ఇశ్రాయేలు శిక్షంచబడుట, పునరుద్ధరించబడుట
2“మీ తల్లిని గద్దించండి, గద్దించండి,
ఆమె నా భార్య కాదు,
నేను ఆమె భర్తను కాను.
ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి,
తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి.
3లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను,
ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను.
ఆమెను ఎడారిలా చేస్తాను,
ఎండిపోయిన భూమిలా చేస్తాను
దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను.
4ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను,
ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు.
5వారి తల్లి వ్యభిచారం చేసింది,
అవమానంలో వారిని కన్నది.
ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను,
వారు నాకు నా ఆహారం, నీళ్లు,
ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.
6కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను;
ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను.
7ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు;
ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు.
అప్పుడు ఆమె ఇలా అంటుంది,
‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను,
ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’
8ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె,
విస్తారమైన వెండి, బంగారాలు,
ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు,
వాటిని బయలు కోసం వాడింది.
9“కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను,
ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను.
ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన
నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను.
10కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట,
ఆమె కామాతురతను బయటపెడతాను,
ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.
11ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని:
ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు,
ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.
12తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే,
ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను;
వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను,
అడవి జంతువులు వాటిని తినివేస్తాయి.
13ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి,
నేను ఆమెను శిక్షిస్తాను;
ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని,
తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది,
కాని నన్ను మరచిపోయింది”
అని యెహోవా చెప్తున్నారు.
14కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను;
నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి,
ఆమెతో మృదువుగా మాట్లాడతాను.
15అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను,
ఆకోరు#2:15 ఆకోరు అంటే శ్రమ లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను.
అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు,
ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.#2:15 లేదా పాడుతుంది
16యెహోవా ఇలా అంటున్నారు,
“ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు;
నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు#2:16 హెబ్రీలో నా యజమాని’ అని పిలువవు.
17నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను;
ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు.
18ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో,
ఆకాశ పక్షులతో,
నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను.
విల్లు, ఖడ్గం, యుద్ధం
దేశంలో లేకుండా చేస్తాను,
అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.
19నీవు శాశ్వతంగా నాతో ఉండేలా,
నేను నిన్ను నీతి, న్యాయంతో,
మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.
20నీవు యెహోవాను తెలుసుకునేలా,
నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను.
21“ఆ రోజున నేను జవాబిస్తాను,”
అని యెహోవా అంటున్నారు.
“నేను ఆకాశాలకు జవాబిస్తాను,
అవి భూమికి జవాబిస్తాయి;
22భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో,
ఒలీవనూనెతో మాట్లాడుతుంది.
అవి యెజ్రెయేలుతో#2:22 యెజ్రెయేలు అంటే, దేవుని మొక్కలు మాట్లాడతాయి.
23నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను;
‘నా ప్రియురాలు కాదు,#2:23 హెబ్రీలో లో-రుహామా; 1:6 వచనం చూడండి’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను.
‘నా ప్రజలు కారు,#2:23 హెబ్రీలో లో-అమ్మీ; 1:9 వచనం చూడండి’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను;
అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 2: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.