యెషయా 3
3
యెరూషలేముకు యూదాకు తీర్పు
1చూడండి, ప్రభువును,
సైన్యాలకు అధిపతియైన యెహోవా
యెరూషలేములో నుండి యూదాలో నుండి
జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు:
అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,
2వీరులు, యోధులు,
న్యాయాధిపతులు, ప్రవక్తలు,
సోదె చెప్పేవారు, పెద్దలు,
3పంచదశాధిపతులను, ఘనత వహించినవారు,
సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు,
తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు.
4“నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను.
పిల్లలు వారిని పరిపాలిస్తారు.”
5ప్రజలు ఒకరిని ఒకరు
ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు.
యువకులు పెద్దవారి మీదికి,
అనామకులు ఘనుల మీదికి లేస్తారు.
6ఒకడు తన తండ్రి ఇంట్లో
తన సోదరుని పట్టుకుని,
“నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు;
ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు.
7కాని ఆ రోజు అతడు కేక వేసి,
“నా దగ్గర పరిష్కారం లేదు.
నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు;
నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.
8యెరూషలేము పాడైపోయింది,
యూదా పతనమవుతుంది,
వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి,
ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.
9వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది;
వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు;
వారు దానిని దాచిపెట్టరు.
వారికి శ్రమ!
వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు.
10మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి
ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.
11దుష్టులకు శ్రమ!
వారికి చెడు జరుగుతుంది!
వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం
వారికి ఇవ్వబడుతుంది.
12నా ప్రజలను యువకులు అణచివేస్తారు
స్త్రీలు వారిని పాలిస్తారు.
నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు
మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.
13యెహోవా న్యాయస్థానంలో తన స్థానం తీసుకుంటారు;
ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన లేస్తారు.
14యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు
తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు:
“మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు;
పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.
15మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు?
పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?”
అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.
16యెహోవా ఇలా అంటున్నారు,
“సీయోను స్త్రీలు గర్విష్ఠులు
వారు మెడలు చాచి నడుస్తూ
ఓర చూపులు చూస్తూ
ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ
తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు.
17కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు;
యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”
18ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు, 19చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు, 20తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు, 21ఉంగరాలు, ముక్కుపుడకలు, 22పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు, 23అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.
24సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది;
నడికట్టుకు బదులు తాడు;
అల్లిన జడకు బదులు బోడితల;
ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట;
అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.
25మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు,
మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.
26సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి;
ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.