యెషయా 32

32
నీతి రాజ్యం
1చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు
అధికారులు న్యాయంగా పాలిస్తారు.
2వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా
తుఫానులో ఆశ్రయంగా
ఎడారిలో నీటి ప్రవాహాల్లా
ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.
3అప్పుడు చూసేవారి కళ్లు ఎప్పుడూ మూసుకుపోవు,
వినేవారి చెవులు వింటాయి.
4భయంతో ఉండే హృదయం తెలుసుకొని, గ్రహిస్తుంది,
నత్తిగల నాలుక చక్కగా, స్పష్టంగా మాట్లాడుతుంది.
5ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు.
దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు.
6మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారు,
వారి హృదయాలు చెడు ఆలోచిస్తాయి;
వారు భక్తిహీనతను పాటిస్తూ
యెహోవా గురించి తప్పుడు వార్త ప్రకటిస్తారు;
ఆకలితో ఉన్నవారికి ఏమి లేకుండా చేస్తారు
దప్పికతో ఉన్నవారికి నీళ్లు లేకుండా చేస్తారు.
7దుష్టులు చెడ్డ పద్ధతులను ఉపయోగిస్తారు,
నిరుపేదలు న్యాయమైన అభ్యర్థన చేసినా,
అబద్ధాలతో పేదవారిని నాశనం చేయడానికి
వారు చెడ్డ ఆలోచనలు చేస్తారు.
8అయితే గొప్పవారు గొప్ప ఆలోచనలు చేస్తారు,
వారు చేసే గొప్ప పనులను బట్టి నిలబడతారు.
యెరూషలేము స్త్రీలు
9ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా,
లేచి నా మాట వినండి;
భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా,
నేను చెప్పే మాట వినండి!
10ఇక ఒక సంవత్సరంలో,
భద్రంగా ఉన్న మీరు భయంతో వణుకుతారు;
ద్రాక్ష పంట పడిపోతుంది.
పండ్లు పంటకు రావు.
11ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి;
భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి
మీ మంచి బట్టలు తీసివేసి
మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.
12ఆహ్లాదకరమైన పొలాల గురించి ఫలించే ద్రాక్షతీగెల గురించి
మీ రొమ్ము కొట్టుకోండి.
13నా ప్రజల భూమిలో
గచ్చపొదలు, ముళ్ళచెట్లు పెరుగుతాయి.
ఆనందోత్సాహాలతో ఉన్న ఇళ్ళన్నిటి కోసం
ఉల్లాసంతో ఉన్న ఈ పట్టణం కోసం దుఃఖించండి.
14కోట విడిచిపెట్టబడుతుంది
కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది;
కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి,
అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా,
మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,
15పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి.
తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా,
ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి.
16అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది,
ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది.
17సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది;
దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి.
18అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో
సురక్షితమైన ఇళ్ళలో
ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.
19వడగండ్లు అడవిని నాశనం చేసినా
పట్టణం పూర్తిగా నేలమట్టమైనా,
20మీరు ఎంతో ధన్యులై ఉంటారు,
మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ,
మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 32: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి