యెషయా 49

49
యెహోవా సేవకుడు
1ద్వీపాల్లారా, నా మాట వినండి;
దూరంగా ఉన్న దేశాల్లారా, ఇది వినండి:
నేను పుట్టక ముందే యెహోవా నన్ను పిలిచారు.
నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నా పేరు పలికారు.
2ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు,
తన చేతి నీడలో నన్ను దాచారు;
నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేసి
తన అంబులపొదిలో నన్ను దాచారు.
3“ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు.
నీ ద్వారా నా మహిమను కనుపరుస్తాను” అని ఆయన నాతో చెప్పారు.
4అయితే నేను, “నేను వృధాగా కష్టపడ్డాను;
ఫలితం లేకుండా నా బలాన్ని ఖర్చు చేశాను
కాని ఖచ్చితంగా నా తీర్పు యెహోవా దగ్గరే ఉంది,
నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది” అని అన్నాను.
5యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను
నా దేవుడే నాకు బలంగా ఉన్నారు
తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి
ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి
తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన,
యెహోవా ఇలా అంటున్నారు:
6ఆయన అంటున్నారు:
“నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి,
ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి
నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము.
నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి
యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”
7రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన
పాలకుల సేవకునితో
ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన
యెహోవా చెప్పే మాట ఇదే:
“యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి
రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు,
యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”
ఇశ్రాయేలు పునరుద్ధరణ
8యెహోవా చెప్పే మాట ఇదే:
“అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను,
రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను;
దేశాన్ని పునరుద్ధరించి
పాడైన స్వాస్థ్యాలను పంచడానికి
బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని,
చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,
9నిన్ను కాపాడి
ప్రజలకు నిబంధనగా నియమిస్తాను.
“వారు దారి ప్రక్కన తింటారు
చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది.
10వారికి ఆకలి గాని దాహం గాని వేయదు.
ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు.
వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి
నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు.
11నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను
నా రహదారులు ఎత్తు చేయబడతాయి.
12చూడండి, వారు దూరం నుండి వస్తారు
కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి,
కొందరు సీనీయుల#49:12 కొ.ప్ర.లలో అశ్వాను దేశం నుండి వస్తారు.”
13ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి;
భూమీ, సంతోషించు;
పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి!
ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు,
బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.
14అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు.
ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది.
15“తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా?
తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా?
తల్లియైన మరచిపోవచ్చు కాని
నేను నిన్ను మరవను!
16చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను;
నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
17నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు.
నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు.
18నీ కళ్ళెత్తి చుట్టూ చూడు;
నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు.
‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు;
పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు.
నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
19“నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా
నీ దేశం పాడుబడినా
నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది,
నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు.
20నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు,
‘ఈ స్ధలం మాకు ఇరుకుగా ఉంది.
ఇంకా విశాలమైన స్ధలం మాకు ఇవ్వు’ అని
నీవు వింటుండగా అంటారు.
21అప్పుడు నీవు నీ హృదయంలో,
‘వీరిని నా కోసం ఎవరు కన్నారు?
నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని;
నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను.
ఈ పిల్లల్ని ఎవరు పెంచారు?
నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను.
కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ”
అని అనుకుంటావు.
22ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను,
జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను;
వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు
నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.
23రాజులు నిన్ను పోషించే తండ్రులుగా
వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు.
వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు;
నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు.
అప్పుడు నీవు, నేను యెహోవాను అని,
నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.”
24యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా?
నీతిమంతుని నుండి బందీలు విడిపించబడతారా?
25అయితే యెహోవా చెప్పే మాట ఇదే:
“అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు,
క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది;
నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను.
నీ పిల్లలను నేను రక్షిస్తాను.
26నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను;
ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు.
అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని
యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని
మానవులందరూ తెలుసుకుంటారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 49: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి