యెషయా 57

57
1నీతిమంతులు నశిస్తారు,
ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు;
భక్తులు మాయమైపోతారు,
కీడు చూడకుండ
నీతిమంతులు కొనిపోబడడం
ఎవరూ గ్రహించరు.
2యథార్థంగా జీవించేవారు
సమాధానంలో ప్రవేశిస్తారు;
వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.
3“అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా!
వేశ్యసంతానమా! ఇక్కడకు రండి.
4మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు?
ఎవరిని చూసి వెక్కిరిస్తూ
మీ నాలుక చాపుతున్నారు
మీరు తిరుగుబాటుదారులు,
అబద్ధికుల సంతానం కాదా?
5మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద
కామంతో రగిలిపోతున్నారు;
మీరు కనుమలలో, రాతిసందుల క్రింద
మీ పిల్లలను బలి ఇస్తారు.
6కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము;
నిజంగా అవే మీకు భాగము.
అవును వాటికి మీ పానార్పణలు పోశారు,
భోజనార్పణలు చెల్లించారు.
ఇదంతా చూసి నేను క్షమించాలా?
7చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు;
బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.
8తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక
మీ యూదేతర గుర్తులు పెట్టారు.
నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు
దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు;
మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు.
వారి నగ్న శరీరాలను కామంతో చూశారు.
9మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు#57:9 లేదా రాజు దగ్గరకు వెళ్లారు
ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు.
మీరు మీ రాయబారులను#57:9 లేదా విగ్రహాలను దూరప్రాంతానికి పంపించారు;
మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు!
10మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు,
అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు.
మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు
కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు.
11“మీరు ఎవరికి జడిసి భయపడి
నా పట్ల నిజాయితీగా లేకుండా,
నన్ను జ్ఞాపకం చేసుకోకుండా
దీనిని పట్టించుకోకుండా ఉన్నారు?
చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని
మీరు నాకు భయపడడం లేదు కదా?
12నీ నీతిని పనులను నేను బయటపెడతాను
అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.
13మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు
మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి!
గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది,
కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది.
అయితే నన్ను ఆశ్రయించినవారు
దేశాన్ని స్వతంత్రించుకుంటారు
నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”
పశ్చాత్తాపం చెందిన వారికి ఆదరణ
14ఇలా చెప్పబడుతుంది:
“కట్టండి, కట్టండి, దారిని సిద్ధపరచండి!
నా ప్రజల మార్గంలో నుండి అడ్డుగా ఉన్నవాటిని తీసివేయండి.”
15ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు:
“నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను,
అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి
నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి
ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.
16నేను వారిని నిత్యం నిందించను,
నేను ఎప్పుడు కోపంగా ఉండను
ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు.
నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు.
17వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను
నేను వారిని శిక్షించి కోపంతో నా ముఖం త్రిప్పుకున్నాను,
అయినా వారు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు.
18నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను;
నేను వారిని నడిపించి ఇశ్రాయేలులో దుఃఖించేవారిని ఓదారుస్తూ,
19వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను.
దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి
సమాధానం, సమాధానం” అని యెహోవా అంటున్నారు.
“నేను వారిని బాగుచేస్తాను.”
20దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు.
అది నెమ్మదిగా ఉండలేదు,
దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.
21“దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 57: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి