యెషయా 9
9
1అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.
2చీకటిలో జీవిస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూశారు;
చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద
ఒక వెలుగు ప్రకాశించింది.
3మీరు దేశాన్ని విస్తరింపజేశారు
వారి సంతోషాన్ని అధికం చేశారు;
కోతకాలంలో ప్రజలు సంతోషించినట్లు
దోపుడుసొమ్ము పంచుకుంటున్నప్పుడు
యుద్ధవీరులు సంతోషించినట్లు
వారు మీ ఎదుట సంతోషిస్తున్నారు.
4మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు,
వారికి భారం కలిగించే కాడిని
వారి భుజాలమీద ఉన్న కర్రను,
వారిని హింసించేవాని కర్రను
మీరు విరిచివేశారు.
5యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు
రక్తంలో చుట్టబడిన బట్టలు
మంటలో వేయబడతాయి
అగ్నికి ఇంధనంగా అవుతాయి.
6ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు,
మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది.
ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు
నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి
అని పిలువబడతాడు.
7ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి
ముగింపు ఉండదు.
ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు
దావీదు సింహాసనం మీద,
అతని రాజ్యాన్ని ఏలుతూ,
న్యాయంతోను నీతితోను
రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు.
సైన్యాలకు అధిపతియైన యెహోవా
ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.
ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపం
8ప్రభువు యాకోబుకు వ్యతిరేకంగా ఒక సందేశం పంపారు;
అది ఇశ్రాయేలు మీద పడుతుంది.
9గర్వం, అహంకారంతో నిండిన
హృదయం కలిగిన ప్రజలందరు
అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు
దానిని తెలుసుకుంటారు.
10“ఇటుకలు పడిపోయాయి,
కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము;
రావి చెట్లు నరకబడ్డాయి,
వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.
11అయితే యెహోవా వారి మీదికి రెజీను విరోధులను లేపారు
వారి శత్రువులను పురికొల్పారు.
12తూర్పు నుండి అరామీయులు, పడమర నుండి ఫిలిష్తీయులు
నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేశారు.
ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,
ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
13అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు,
సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.
14కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను,
తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు.
15పెద్దలు ప్రముఖులు తల అయితే,
అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోక.
16ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు;
వారిని వెంబడించేవారు చెదిరిపోతారు.
17కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు
తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు.
ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు,
ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది.
ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,
ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
18ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది
అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది;
అడవి పొదలను దహనం చేసి
దట్టమైన పొగలా పైకి లేస్తుంది.
19సైన్యాల యెహోవా ఉగ్రత వలన
భూమి కాలిపోతుంది
ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు;
వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు.
20కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు
కాని ఇంకా ఆకలితోనే ఉంటారు.
ఎడమ ప్రక్కన దానిని తింటారు
కాని తృప్తి పొందరు.
వారిలో ప్రతిఒక్కరు తన సంతానం#9:20 లేదా చేతి యొక్క మాంసాన్ని తింటారు.
21మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు.
వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు.
ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,
ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.