న్యాయాధిపతులు 14

14
సంసోను పెళ్ళి
1సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. 2అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి” అని అన్నాడు.
3అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు.
కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.” 4(ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)
5సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది. 6యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు. 7తర్వాత సంసోను తిమ్నాతుకు వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు, ఆమెను ఇష్టపడ్డాడు.
8కొంతకాలం తర్వాత, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. ఆ కళేబరంలో తేనెటీగ గుంపును, కొంచెం తేనెను అతడు చూశాడు. 9అతడు కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని తింటూ ముందుకు వెళ్లాడు. అతడు తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నప్పుడు, వారికి కొంచెం ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. అయితే సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.
10అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి. 11ప్రజలు అతన్ని చూడగానే వారు అతనికి తోడుగా ఉండడానికి ముప్పైమంది యువకులను తీసుకువచ్చారు.
12సంసోను వారితో అన్నాడు, “మీకు ఒక పొడవు కథ చెప్తాను, ఈ విందు జరిగే ఏడు రోజుల్లో మీరు దాని జవాబు చెప్తే, ముప్పై సన్నని నారబట్టలు, ముప్పై జతల దుస్తులు ఇస్తాను. 13ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే, ముప్పై సన్నటి నారబట్టలు, ముప్పై జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి.”
వారు అన్నారు, “నీ పొడుపు కథ చెప్పు, మేము వింటాము.”
14అందుకు అతడు అన్నాడు,
“తినే దానిలో నుండి తిండి వచ్చింది,
బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.”
మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు.
15నాల్గవ#14:15 కొ.ప్రా.ప్ర.లో ఏడవ రోజు రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”
16అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది.
అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?” 17విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.
18ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు,
“తేనె కంటే తియ్యగా ఉండేదేంటి?
సింహం కంటే బలమైనదేది?”
అందుకు సంసోను,
“మీరు నా దూడ దున్నకపోతే
నా పొడుపు కథను చెప్పే వారే కాదు”
అన్నాడు.
19అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు. 20సంసోను భార్యను ఆ విందుకు వచ్చిన సంసోను స్నేహితుల్లో ఒకనికి ఇచ్చి పెళ్ళి చేశారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 14: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి