న్యాయాధిపతులు 16
16
సంసోను దెలీలా
1ఒక రోజు సంసోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి రాత్రి ఆమెతో గడపడానికి ఆమె దగ్గర ఉండిపోయాడు. 2“సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు.
3అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు.
4కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. 5ఫిలిష్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, “మేము అతన్ని కట్టిపడేసి లొంగదీసుకోడానికి నీవు అతన్ని ఆకర్షించుకుని అతని గొప్ప బలం యొక్క రహస్యం ఏమిటో, అతన్ని మేము ఎలా గెలవగలమో తెలుసుకో! అప్పుడు మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి షెకెళ్లు#16:5 అంటే, దాదాపు 13 కి. గ్రా. ఇస్తాం” అని అన్నారు.
6కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది.
7అందుకు సంసోను ఆమెతో, “ఎవరైనా నన్ను తడి ఆరని ఏడు పచ్చి క్రొత్త వింటినారలతో కట్టేస్తే, నా బలం పోయి నేను మామూలు మనుష్యుల్లా అవుతాను” అని జవాబిచ్చాడు.
8అప్పుడు ఫిలిష్తీయుల నాయకులు తడి ఆరని ఏడు పచ్చి వింటినారలు ఆమె తెచ్చి ఇవ్వగా, ఆమె వాటితో అతన్ని కట్టేసింది. 9లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు.
10అప్పుడు దెలీలా సంసోనుతో, “నీవు నన్ను మోసం చేశావు; నాకు అబద్ధం చెప్పావు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు” అని అన్నది.
11అప్పుడు సంసోను, “ఎవరైనా నన్ను ఎప్పుడు వాడని క్రొత్త త్రాళ్లతో కట్టేస్తే, నేను ఇతర మనుష్యుల్లా బలహీనమవుతాను” అని జవాబిచ్చాడు.
12కాబట్టి దెలీలా క్రొత్త త్రాళ్లు తెచ్చి వాటితో అతన్ని కట్టేసి గదిలో మనుష్యులతో దాక్కొని ఉండగా, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని చెప్పింది. అయితే అతడు త్రాళ్లను నూలుపోగుల వలె తెంపేశాడు.
13అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది.
అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి, 14మేకు పెట్టి బిగించింది.
అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు.
15అప్పుడు ఆమె, “నామీద నమ్మకం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నీ గొప్ప బలం యొక్క రహస్యం నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడం ఇది మూడవసారి” అని అన్నది. 16ఇలా ఆమె ప్రతిరోజు అతన్ని వేధించడంతో అతడు చస్తే బాగుండేది అనుకున్నాడు.
17అతడు ఆమెకు మొత్తం చెప్పేశాడు, “నేను పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాను. నా తలమీద ఇంతవరకు ఎన్నడు మంగల కత్తి పడలేదు. నా తలవెంట్రుకలు పూర్తిగా తీసివేస్తే నా బలం తొలగిపోయి నేను అందరు మనుష్యుల్లా బలహీనమవుతాను” అని చెప్పాడు.
18అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, “మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు” అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు. 19ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది.
20అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది.
అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.
21తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు. 22అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి.
సంసోను మరణం
23ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు.
24ఆ ప్రజలు అతన్ని చూసి,
“మన దేవుడు మన శత్రువును
మన చేతులకు అప్పగించాడు,
మన దేశాన్ని పాడు చేసినవాన్ని,
మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు”
తమ దేవున్ని పొగిడారు,
25వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు.
వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు, 26తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను” అని అడిగాడు. 27ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు. 28అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు. 29తర్వాత సంసోను గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో కుడిచేతితో ఒకదాన్ని ఎడమచేతితో ఒకదాన్ని పట్టుకుని, 30సంసోను, “నేను నాతోపాటు ఫిలిష్తీయులు కలిసి చస్తాం” అంటూ బలంగా ముందుకు వంగాడు! అంతే ఆ గుడి దానిలో ఉన్న అధికారులు ప్రజలు అందరి మీదా కూలి, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపాడు.
31అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 16: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.