యిర్మీయా 7

7
యిర్మీయా ప్రసంగం
1యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: 2“యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి:
“ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి. 3సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను. 4మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!” 5మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే, 6మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే, 7నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను. 8కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.
9“ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం,#7:9 లేదా అబద్ధ దేవుళ్ళ మీద ప్రమాణం దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, 10తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా? 11నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు.
12“ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి. 13మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. 14కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను. 15మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’
16“కాబట్టి ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు, వేడుకోవద్దు, ఏ మనవి చేయవద్దు; నా దగ్గర ప్రాధేయపడవద్దు, ఎందుకంటే నేను నీ మాట వినను. 17యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా? 18పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు. 19కానీ వారు కోపం రెచ్చగొడుతుంది నన్నా? వారు తమకు అవమానం కలిగేలా, తమకు తాము హాని చేసుకోవడం లేదా? అని యెహోవా అడుగుతున్నారు.
20“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు.
21“ ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ ఇతర బలులతో పాటు మీ దహనబలులను కలిపి, మాంసాన్ని మీరే తినండి! 22నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి వారితో మాట్లాడినప్పుడు, నేను వారికి దహనబలులు బలుల గురించి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వలేదు, 23నేను వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాను: నాకు లోబడండి, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీకు మేలు జరిగేలా నా మార్గాలన్నిటిని అనుసరించండి. 24కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు; పైగా, వారు తమ చెడ్డ హృదయాల్లో ఉన్న మొండి కోరికలను అనుసరించి, వారు ముందుకు వెళ్లకుండా వెనుకకు వెళ్లారు. 25మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను. 26కానీ వారు నా మాట వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు మెడ వంగనివారై, వారి పూర్వికులకంటే ఇంకా ఎక్కువ చెడు చేశారు.’
27“నీవు ఇవన్నీ వారికి చెప్పినప్పుడు, వారు నీ మాట వినరు; నీవు వారిని పిలిచినప్పుడు, వారు జవాబివ్వరు. 28కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ఇది దాని దేవుడైన యెహోవాకు లోబడని దిద్దుబాటుకు స్పందించని దేశము. నమ్మకత్వం లేకుండా పోయింది; అది వారి పెదవుల నుండి మాయమై పోయింది.
29“ ‘ప్రతిష్ఠించబడిన మీ వెంట్రుకలు కత్తిరించి పారవేయండి; బంజరు కొండలమీద విలపించండి, ఎందుకంటే యెహోవా తన ఉగ్రత క్రింద ఉన్న ఈ తరాన్ని తిరస్కరించారు, వదిలేశారు.
సంహార లోయ
30“ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు. 31వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు. 32కాబట్టి జాగ్రత్త, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ప్రజలు ఇకపై తోఫెతు అని గాని బెన్ హిన్నోము లోయ అని గాని పిలువక, సంహార లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, ఎందుకంటే వారు తోఫెతులో స్థలం లేకుండ పోయే వరకు చనిపోయినవారిని పాతిపెడతారు. 33అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు. 34యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి