యోబు 4

4
ఎలీఫజు
1అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు:
2ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా?
కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?
3ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో,
ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.
4తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి;
క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.
5అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు;
అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.
6నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా?
నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?
7“ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా?
యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?
8నేను చూసినంత వరకు చెడును దున్ని
కీడును నాటేవారు దానినే కోస్తారు.
9దేవుని శ్వాసకు వారు నశిస్తారు;
ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.
10సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో,
అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.
11సింహం తిండి దొరకక నశిస్తుంది,
సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.
12“నాకొక విషయం రహస్యంగా తెలిసింది,
నా చెవులు దాని గుసగుసను విన్నాయి.
13ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు,
రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,
14భయం వణకు నన్ను చుట్టుకొని
నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.
15ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది,
నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
16అది నా దగ్గర నిలిచింది,
కాని అది ఏమిటో నేను చెప్పలేను.
ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది,
మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.
17‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా?
మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?
18దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు,
తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,
19మట్టి ఇళ్ళలో నివసిస్తూ,
దుమ్ములో పునాదులు గలవారిని,
చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!
20ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి,
గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.
21వారి డేరా తాడు తెంపివేయబడుతుంది,
జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 4: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి