యోబు 9
9
యోబు
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2“అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు.
అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?
3వారు ఆయనతో వాదించాలనుకుంటే,
వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.
4ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు.
ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు?
5ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు,
కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.
6ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి
దాని స్తంభాలు అదిరేలా చేస్తారు.
7ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు.
ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.
8ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు
సముద్రపు అలలను అణచివేస్తారు.
9స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను
దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు.
10ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను
లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు.
11ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను,
ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను.
12ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు?
‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?
13దేవుడు తన కోపాన్ని అణచుకోరు;
రాహాబు#9:13 రాహాబు పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు. సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు.
14“కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను?
ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?
15నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను.
కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను.
16నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా,
ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.
17తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు,
ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.
18ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు
కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.
19బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు!
న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?
20నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది;
నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.
21“నేను నిర్దోషినినైనా
నా గురించి నాకు శ్రద్ధ లేదు.
నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.
22ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను,
దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.
23ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే,
నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.
24భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు,
ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు.
ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?
25“పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి;
ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.
26రెల్లు పడవలు దాటిపోతున్నట్లు,
గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.
27నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి
సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,
28నా బాధలన్నిటికి భయపడతాను
ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.
29నేను దోషినని తేలినప్పుడు,
నాకెందుకు ఈ వృధా ప్రయాస?
30సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా,
శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,
31మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు,
అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
32“నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి
దేవుడు నాలాంటి మనిషి కాదు.
33మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు,
మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,
34దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది,
అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.
35అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను,
కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.