లేవీయ 4
4
పాపపరిహారార్థ బలి
1యెహోవా మోషేతో అన్నారు, 2“ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు ఇలా చేయాలి.
3“ ‘అభిషేకించబడిన యాజకుడు పాపం చేసి ప్రజలపై అపరాధాన్ని తెస్తే, అతడు చేసిన పాపానికి పాపపరిహారబలిగా#4:3 లేదా శుద్ధీకరణ అర్పణ లోపం లేని ఒక కోడెను యెహోవా దగ్గరకు తీసుకురావాలి. 4ఆ కోడెను యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకురావాలి. దాని తలపై చేయి పెట్టి యెహోవా ఎదుట దానిని వధించాలి. 5అప్పుడు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడె రక్తాన్ని కొంత సమావేశ గుడారం లోనికి తీసుకురావాలి. 6అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధాలయం యొక్క తెర ముందు యెహోవా ఎదుట ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. 7యాజకుడు అప్పుడు కొంచెం రక్తాన్ని సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న పరిమళ వాసనగల ధూపవేదిక కొమ్ములపై పూయాలి. మిగిలిన ఎద్దు రక్తం అతడు సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి. 8పాపపరిహారబలి కోసం తెచ్చిన కోడె యొక్క క్రొవ్వంతా అంటే లోపలి అవయవాలకు ఉన్న క్రొవ్వు, 9రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు 10సమాధానబలిగా అర్పించబడే ఎద్దు క్రొవ్వును తీసేసినట్లే తీయాలి. అప్పుడు యాజకుడు వాటిని దహనబలి యొక్క బలిపీఠం మీద కాల్చాలి. 11అయితే కోడెలో ఇంకా మిగిలి ఉన్నవి అంటే చర్మం, దాని పూర్తి మాంసం, తల, కాళ్లు, లోపలి అవయవాలు, పేడ 12అంటే కోడె శేషమంతటిని శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన ప్రదేశానికి, బూడిద పడవేయబడే స్థలానికి తీసుకెళ్లి, బూడిద కుప్ప మీద కట్టెల మంటలో దానిని కాల్చాలి.
13“ ‘ఒకవేళ ఇశ్రాయేలీయుల సమాజమంతా పొరపాటున యెహోవా చేయకూడదని ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా చేసి అపరాధులై తాము చేసిన తప్పును గ్రహించినప్పుడు, సమాజానికి ఈ విషయం తెలియకపోయినా, వారు అపరాధులు, 14వారు చేసిన పాపం బయటపడినప్పుడు, సమాజం పాపపరిహారబలిగా ఒక కోడెను తెచ్చి సమావేశ గుడారం ఎదుట సమర్పించాలి. 15సమాజపెద్దలు యెహోవా ఎదుట కోడె తలమీద చేతులు ఉంచి యెహోవా ఎదుట కోడెను వధించాలి. 16అప్పుడు అభిషేకించబడిన యాజకుడు కోడె రక్తంలో కొంత భాగాన్ని సమావేశ గుడారంలోకి తీసుకెళ్లాలి. 17అతడు ఆ రక్తంలో వ్రేలు ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు తెర ఎదుట చిలకరించాలి. 18అతడు సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం కొమ్ములపై కొంత రక్తాన్ని పూసి మిగిలిన రక్తం సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి. 19అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి, 20పాపపరిహారబలి కోసం కోడెను చేసినట్లే దీనికి కూడా చేయాలి. ఈ విధంగా యాజకుడు సమాజానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు వారు క్షమించబడతారు. 21తర్వాత అతడు ఎద్దును శిబిరం బయటకు తీసుకెళ్లి మొదటి ఎద్దును కాల్చినట్లుగా దానిని కాల్చాలి. ఇది సమాజం కోసం చేసిన పాపపరిహారబలి.
22“ ‘ఒక నాయకుడు అనుకోకుండ పాపం చేసి, తన దేవుడైన యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైనా చేసినప్పుడు, అతడు అపరాధి, 23తాను దేన్ని బట్టి పాపం చేశాడో తెలుకున్నప్పుడు అతడు లోపం లేని మేకపోతును అర్పణగా తీసుకురావాలి. 24అతడు మేక తలపై చేయి ఉంచి, యెహోవా ఎదుట దహనబలిని వధించిన స్థలంలో దానిని వధించాలి. ఇది పాపపరిహారబలి. 25అప్పుడు యాజకుడు పాపపరిహారబలి రక్తం నుండి కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి. 26అతడు సమాధాన బలిపశువు క్రొవ్వును కాల్చినట్టే దీని క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు ఆ నాయకుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతడు క్షమించబడతాడు.
27“ ‘సమాజంలోని ఏ సభ్యుడైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేస్తే, వారు అపరాధులు, 28వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి. 29వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి. 30అప్పుడు యాజకుడు తన వ్రేలితో కొంత రక్తాన్ని తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి. 31సమాధానబలి నుండి క్రొవ్వును తీసినట్లే వారు కొవ్వంతా తీస్తారు, యాజకుడు దానిని బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
32“ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి. 33వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి. 34అప్పుడు యాజకుడు పాపపరిహారబలిలో కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి. 35సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 4: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.