లూకా సువార్త 10

10
డెబ్బైరెండు మందిని పంపిన యేసు
1ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు#10:1 కొ.ప్ర.లలో డెబ్బై అలాగే 17 లో కూడ ఉంది మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు. 2ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు. 3వెళ్లండి! నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లల్లా పంపుతున్నాను. 4మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు.
5“మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, మొదట, ‘ఈ ఇంటికి సమాధానం కలుగును గాక’ అని చెప్పండి. 6ఒకవేళ అక్కడ సమాధానం కోరేవారుంటే, మీ సమాధానం వారి మీద నిలుస్తుంది; ఒకవేళ లేకపోతే, అది మీకే తిరిగి వస్తుంది. 7వారు ఏది ఇచ్చినా తింటూ త్రాగుతూ, అక్కడే ఉండండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.
8“మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, వారు మిమ్మల్ని చేర్చుకొంటే, వారు మీకు ఇచ్చే వాటిని తినండి. 9అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచండి, ‘దేవుని రాజ్యం సమీపించింది’ అని వారితో చెప్పండి. 10అయితే మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు ఆ గ్రామ వీధులలోనికి వెళ్లి, 11‘మీకు హెచ్చరికగా మా పాదాల దుమ్మును కూడా దులిపి వేస్తున్నాము. అయినా దేవుని రాజ్యం సమీపించింది’ అని తెలుసుకోండి. 12నేను చెప్పేదేంటంటే, తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ గతి భరించ గలదిగా ఉంటుంది.
13“కొరజీనూ, నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, పశ్చాత్తాపపడి ఉండేవారు. 14అయితే తీర్పు దినాన మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది. 15ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు.
16“మీ మాటలను వినేవారు నా మాటలను వింటారు; మిమ్మల్ని నిరాకరించే వారు నన్ను నిరాకరిస్తారు; అయితే నన్ను నిరాకరించే వారు నన్ను పంపినవానిని నిరాకరిస్తారు” అన్నారు.
17ఆ డెబ్బైరెండు మంది సంతోషంగా తిరిగివచ్చి ఆయనతో, “ప్రభువా, దయ్యాలు కూడ నీ పేరిట మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
18దానికి ఆయన, “సాతాను ఆకాశం నుండి మెరుపులా పడడం చూశాను. 19ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు. 20అయినా కానీ, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, కాని మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పారు.
21ఆ సమయంలో, యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందిస్తూ, ఇలా అన్నారు: “తండ్రీ! భూమి ఆకాశాలకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు తెలివైనవారికి మరుగుచేసి, చిన్న పిల్లలకు బయలుపరిచావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అవును, తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము.
22“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.”
23అప్పుడు ఆయన తన శిష్యులవైపు తిరిగి వారితో ఏకాంతంగా, “మీరు చూస్తున్నవాటిని చూసే కళ్లు ధన్యమైనవి. 24ఎందుకంటే అనేకమంది ప్రవక్తలు, రాజులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో చెప్తున్నాను” అని అన్నాడు.
మంచి సమరయుని ఉపమానం
25ఒక రోజు ఒక ధర్మశాస్త్ర నిపుణుడు లేచి యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
26అందుకు యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? దాన్ని నీవు ఎలా చదువుతావు?” అని అడిగారు.
27అందుకు అతడు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో, మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’#10:27 ద్వితీ 6:5 ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’#10:27 లేవీ 19:18  ” అని చెప్పాడు.
28దానికి యేసు, “నీవు సరిగ్గా చెప్పావు, ఇది చేస్తే నీవు జీవిస్తావు” అని జవాబిచ్చారు.
29అయితే అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకోడానికి, “నా పొరుగువాడు ఎవడు?” అని యేసుని అడిగాడు.
30అందుకు యేసు, “ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉండగా, బందిపోట్లు అతని మీద దాడి చేశారు. వారు అతని బట్టలు దోచుకొని, అతన్ని కొట్టి, సగం చచ్చినవానిగా అతన్ని విడిచి, వెళ్లిపోయారు. 31అప్పుడే ఒక యాజకుడు ఆ దారిన వెళ్తూ, వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు. 32అలాగే ఒక లేవీయుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు. 33అయితే ఒక సమరయుడు, ప్రయాణం చేస్తూ, వాడు పడి ఉన్న చోటికి వచ్చాడు; అతడు వానిని చూసినప్పుడు, వాని మీద జాలిపడ్డాడు. 34అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. 35మరునాడు అతడు రెండు దేనారాలు#10:35 దేనారం అంటే, సాధారణంగా ఒక రోజు కూలి (మత్తయి 20:2) తీసి ఆ సత్రపు యజమానికి ఇచ్చాడు. ‘ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నీవు అధనంగా ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, నేను మళ్ళీ వచ్చినప్పుడు దానిని తిరిగి చెల్లిస్తాను’ అని అతనితో చెప్పి వెళ్లాడు.
36“దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?” అని అతన్ని అడిగారు.
37అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, “వాని పట్ల కనికరం చూపినవాడే” అని చెప్పాడు.
యేసు అతనితో, “నీవు వెళ్లి అలాగే చేయి” అన్నారు.
మార్త మరియల ఇంట్లో యేసు
38యేసు ఆయన శిష్యులు దారిన వెళ్తూ, ఒక గ్రామానికి వచ్చారు. అక్కడ మార్త అనే పేరుగల స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. 39ఆమె సహోదరి పేరు మరియ, ఆమె ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధను వింటూ ఉంది. 40అయితే మార్త తాను చేయాల్సిన ఏర్పాట్లపైనే దృష్టి పెట్టింది. ఆమె ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరి పనులన్నీ నాకే వదిలేసి ఇక్కడ కూర్చుంది అయినా నీవు పట్టించుకోవా? నాకు సహాయం చేయమని చెప్పండి!” అని అన్నది.
41ప్రభువు ఆమెతో, “మార్తా, మార్తా, నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు, 42కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లూకా సువార్త 10: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి